
ప్రేక్షకులను రప్పించడమే పెద్ద సవాల్
● సామాజిక స్పృహతో శంకర్ సినిమాలు ● సినీ నిర్మాత సురేష్ బాబు
తిరుమల: సినిమా టికెట్ల ధర పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని, అయితే ప్రస్తుతం టిక్కెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు రప్పించడమే తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని ప్రముఖ సినీ నిర్మాత సురేష్ తెలిపారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు డైరెక్టర్ మలినేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్ కూడా దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సామాజిక స్పృహతో శంకర్ తీసే చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కోసం తమవంతు బాధ్యతగా పని చేయాలని కోరారు.