వైరల్‌ పోస్ట్‌: జొమాటో రియాక్షన్‌

Zomato Reaches Out as Litti-Chokha Vendor Story Goes Viral  - Sakshi

లిట్టీ చోఖా కథనంపై   స్పందించిన జొమాటో

జర్నలిస్టు కథనంపై జొమాటో సానుకూల స్పందన

సాయం అందిస్తున్న  నెటిజన్లు 

సాక్షి,ముంబై:  నాణేనికి రెండు వైపులా అన్నట్టు సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇబ్బందుల్లో  ఉన్న చిరు వ్యాపారులకు, ఇతర బాధితులకు భారీ ప్రయోజనమే లభిస్తోంది. ఇటీవల మనవరాలి చదువుకోసం ఇల్లునే అమ్ముకున్న ఒక పెద్దాయన పట్ల నెటిజన్లు మానవత్వంతో  స్పందించారు. అంతకుముందు ఢిల్లీకి చెందిన ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులకు సోషల్‌మీడియా ద్వారా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్థిక సంక్షోభంలో పడి విలవిల్లాడుతున్న ముంబైకి చెందిన ‘లిట్టీ చోఖా’ అమ్ముకుని జీవించే చిరువ్యాపారి కథనం వైరల్‌గా మారింది. జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది మొదలు పెట్టిన ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌కు భారీ స్పందన లభించింది. ప్రధానంగా ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటోతో పాటు, ఇతర దాతలు స్పందించిన  తీరు విశేషంగా నిలిచింది.(జొమాటో వివాదం: ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్)

ఫ్రీలాన్స్  జర్నలిస్టు ప్రియాన్షు ద్వివేది సోషల్‌ మీడియాలో ఈ కథనాన్ని పోస్ట్‌ చేశారు. వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్‌కు చెందిన  యోగేశ్‌ ముంబైలోని వెర్సోవా బీచ్‌లో లిట్టి చోఖా అమ్మకుని జీవనం సాగించేవాడు. స్టాల్‌లో రెగ్యులర్‌గా లీట్టీలను ఆస్వాదించే ద్వివేది మాటల సందర్బంలో యోగేశ్‌ కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినట్టు తెలుసుకున్నారు. పాపులర్‌ లిట్టి-చోఖాను చట్నీ, బటర్, సలాడ్‌తో కలిపి కేవలం ఇరవై రూపాయలకు అమ్ముతున్నా కొనేవారు కరువైన పరిస్థితి. చివరికి దుకాణం కూడా మూసి వేయాల్సిన దుస్థితి ఏర్పడింది.  సోదరుడితోపాటు, తమ జీవనం దుర్భరంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా ద్వివేదితో వాపోయారు ఈ నష్టాలను భరించే శక్తి ఇక తనకు లేదనీ, స్టాల్‌ను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదంటూ యోగేశ్‌ ఆవేదన  చెందారు. దీంతో చలించిన ద్వివేది యోగేశ్‌కు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక పోస్ట్‌ పెట్టారు. అంతేకాదు దీన్ని జోమాటోను ట్యాగ్‌ చేస్తూ  మార్చి 16 న ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ రెండు వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. అలాగే జొమాటోలో అతడి దుకాణాన్ని నమోదు చేయాలని నెటిజన్లు కూడా అభ‍్యర్థించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

జొమాటో స్పందన
దీనికి జొమాటోతో పాటు కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. యోగేశ్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతని వివరాలను సేకరించేపనిలో పడింది. ప్రతిస్పందన ఆలస్యం అయినందుకు క్షమించండి. వీలైతే, దయచేసి యోగేశ్‌ కాంటాక్ట్‌ నంబర్‌తో  పాటు, ఇతర వివరాలను  తమకు అందించాలని కోరింది. దీనిపై ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. సాయం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

లిట్టీ-చోఖా: బిహార్‌కు చెందిన వంటకం ఇది. గోధుమపిండితో చేసిన చపాతిలో పప్పులు, ఇతర మసాలాలను స్టఫ్‌ చేసి, నిప్పులపై కాలుస్తారు. దీన్ని నేతితోనూ, వంకాయ కూర లేదా ఆలూకూరతో కలిపి తింటారట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top