ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే నెలల తరబడి వేచి చూడటం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఏటీఎం కార్డులు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. 'ఈపీఎఫ్ఓ 3.0' అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ఈనెల (మే 2026) చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ఈటీ నౌ ఉటంకించిన వర్గాల సమాచారం.
ఏటీఎం నుంచి సగమే!
కొత్త వ్యవస్థ ప్రకారం, చందాదారుల పీఎఫ్ ఖాతాలకు అనుసంధానించిన ప్రత్యేక ఏటీఎం కార్డులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దరఖాస్తులు, డాక్యుమెంట్ల తతంగం లేకుండానే అవసరమైనప్పుడు నిధులను డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించే అవకాశం ఉందని సమాచారం.
విత్‌డ్రాకు కావాల్సినవి..
యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN).
ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం.
బ్యాంక్ ఖాతా వివరాలు, సరైన IFSC కోడ్.
నిబంధనల సరళీకరణ
గతంలో ఉన్న సంక్లిష్టమైన 13 రకాల ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్ఓ కేవలం మూడు ప్రధాన వర్గాలుగా కుదించింది.
అత్యవసరాలు: వైద్య అత్యవసరాలు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు. ఇందులో విద్యా రుణం కోసం 10 సార్ల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహ ఖర్చుల కోసం 5 సార్ల వరకు నిధులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది.
గృహ అవసరాలు: ఇల్లు కొనడం, నిర్మాణం, ఇంటి మరమ్మతులు లేదా హోమ్ లోన్ చెల్లింపులు.
ప్రత్యేక పరిస్థితులు: ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు.
ఈపీఎఫ్ఓ 3.0: మరిన్ని కీలక మార్పులు
సర్వీస్ పరిమితి తగ్గింపు: కేవలం 12 నెలల సర్వీస్ ఉన్నా సరే పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఇచ్చేలా రూల్స్ మారుతున్నాయి.
ఎక్కువ మొత్తం విత్ డ్రా: గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే వచ్చేది. ఇప్పుడు యజమాని వాటా, దానిపై వడ్డీని కూడా కలిపి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఉద్యోగం కోల్పోతే: ఉద్యోగం పోయిన వెంటనే 75% బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఏడాది పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
పూర్తి విత్ డ్రాయల్: 55 ఏళ్ల పదవీ విరమణ, వైకల్యం, విదేశాలకు వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి మొత్తం తీసుకోవచ్చు.
రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారం
కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ వేగవంతమైంది. 2024-25లో 6.01 కోట్లుగా ఉన్న క్లెయిమ్ల పరిష్కారం, 2025-26 నాటికి 8.31 కోట్లకు చేరింది.
త్వరలో రాబోయే ఈ 'ఈపీఎఫ్ఓ 3.0'తో సామాన్య ఉద్యోగులకు తమ సొంత డబ్బుపై పూర్తి నియంత్రణ లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: EPFO: రూ.7500లకు గనక పెంచితే..


