ఎల్‌పీజీపై రూ.300 తగ్గించుకోండిలా! | West Asia Crisis Pushes LPG Prices to Record Highs Hotels Feel the Heat | Sakshi
Sakshi News home page

ఎల్‌పీజీపై రూ.300 తగ్గించుకోండిలా!

May 5 2026 6:18 PM | Updated on May 5 2026 6:18 PM

West Asia Crisis Pushes LPG Prices to Record Highs Hotels Feel the Heat

అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం సామాన్యుడి వంటగదిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరడం హోటల్, రెస్టారెంట్ రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు ఊరటనిస్తోంది.

గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలు

మే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.993 పెరిగి రూ.3,071.50కు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక ధర. కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు రూ.1,303 మేర పెరగడం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గత మూడు నెలల గణాంకాలు

మార్చి: రూ.114.50 పెంపు

ఏప్రిల్: రూ.195.50 పెంపు

మే: రూ.993 పెంపు

చిన్న సిలిండర్లు: 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.549 నుంచి రూ.810.50కి పెరగడంతో చిన్న వ్యాపారులకు కూడా భారం పెరిగింది.

డిమెస్టిక్‌ వినియోగదారుల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతానికి డొమెస్టిక్‌ గ్యాస్ (14.2 కేజీలు) ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సబ్సిడీతో ఉపశమనం.. రూ.300 ఆదా ఇలా!

ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్లకు వర్తిస్తుంది. 5 కిలోల సిలిండర్ వాడే వారికి దామాషా పద్ధతిలో సబ్సిడీ అందుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, ఇన్‌స్టలేషన్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్, స్టవ్‌ను కూడా ఉచితంగా అందిస్తూ సామాన్యులు క్లీన్ ఫ్యూయెల్‌ ఎల్పీజీ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.

వాణిజ్య సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో కొంత రక్షణ ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు గ్యాస్ ధరలను ఎలా శాసిస్తాయనేది వేచి చూడాలి. ఈ తరుణంలో ఉజ్వల పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సామాన్యులకు ఊపిరినిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

Advertisement
 
Advertisement
Advertisement