
యూఎస్‌లో సుమారు రూ.8.3 లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటన
భారత్‌లో ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించిన యాపిల్ కంపెనీ తాజాగా యూఎస్‌లోనూ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌కు తరలించాలన్న కంపెనీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వారాల కొందట బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాంతో కంపెనీ ఈమేరకు చర్యలు తీసుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశీయ తయారీ, సరఫరా గొలుసు కార్యకలాపాలను విస్తరించేందుకు వచ్చే నాలుగేళ్లలో ఈమేరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది.
యాపిల్ చేసిన ప్రకటనను ఉద్దేశించి శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. అందులో అమెరికా తయారీ రంగానికి ఈ చర్య పెద్ద విజయం అని తెలిపారు. ‘యాపిల్ ఈ రోజు చేసిన ప్రకటన మా తయారీ పరిశ్రమకు మరొక విజయం. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతను రక్షించడానికి కీలకమైన ఉత్పత్తిని ప్రారంభిస్తుంది’ అని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కంపెనీ యూఎస్‌లో 500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 100 బిలియన్ డాలర్లు ఇందుకు తోడయ్యే అవకాశం ఉంది.
యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్య
భారత్‌లో ఉత్పత్తిని విస్తరించాలన్న యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్య ఉందని ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఖతార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యాపిల్ సీఈఓ టిమ్‌కుక్‌తో నేరుగా ‘మీరు భారత్‌లో యాపిల్ కార్యకలాపాలు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బహిరంగంగానే చెప్పారు.
సుంకాలు పెంపు..
రష్యా చమురు దిగుమతులను భారత్ కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత వస్తువులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకం విధించిన రోజే యాపిల్ తన పంథాను మార్చుకుంది. కొత్త పన్నులు 21 రోజుల్లో అమల్లోకి రానుండడంతో భారత ఎగుమతులపై మొత్తం అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకుంటాయి. దాంతో యాపిల్ ఉత్పత్తులను భారత్‌లో తయారు చేసి తిరిగి అమెరికాకు ఎగుమతి చేసే క్రమంలో 50 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి భారంగా మారనుంది.
ఇదీ చదవండి: 365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా..