ఎలన్ మస్క్: రష్యాకు హ్యాండ్.. భారత్ కోసమేనా?

Elon Musk On Tesla Giga Factory: టెస్లా యజమాని ఎలన్ మస్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గిగా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
గిగా ఫ్యాక్టరీ చుట్టూ వివాదం
ఎలన్ మస్క్ భవిష్యత్తు టెక్నాలజీ ఆధారంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దిట్ట, వ్యాపార వ్యూహాలను అమలు చేయడంలో మొనగాడు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉంటారాయన. కార్ల తయారీకి సంబంధించి మెగా ఫ్యాక్టరీలను మరింత ముందుకు తీసుకెళ్లి గిగా ఫ్యాక్టరీ అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసిన వ్యక్తి ఎలన్ మస్క్. ఇప్పుడా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనే అంశం చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి.
నాలుగో ఫ్యాక్టరీ ఎక్కడ
టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి అమెరికాలో టెక్సాస్, జర్మనీలోని బెర్లిన్‌లో రెండు గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మూడో ఫ్యాక్టరీని ఫ్యాక్టరీని చైనాలోని షాంగైలో కడతామంటూ ప్రకటించారు. ఇదే సమయంలో రష్యా ప్రభుత్వంతోనూ ఎలన్ మస్క్ చర్చలు ప్రారంభించారు. ఈ సంప్రదింపులు సానుకూలంగా జరిగాయని, త్వరలో టెస్లా గిగా ఫ్యాక్టరీ రష్యాలోని కోరోలెవ్‌లో నిర్మించబోతున్నారంటూ అక్కడి అధికారులు ప్రకటించారు.
మాట మార్చారు
రష్యాలో టెస్లా గిగా ఫ్యాక్టరీ ప్రకటన వెలువడి నెలలు గడుస్తోన్న పనులు ఇంకా ప్రారంభం కావకపోవడంతో ఓ రష్యన్ ఇదే విషయంపై ఎలన్ మస్క్‌ను ప్రశ్నించాడు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ నాలుగో గిగా ఫ్యాక్టరీ ఎక్కడ నిర్మించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ కొత్త రాగం అందుకున్నారు.
Tesla has not yet decided on a fourth Gigafactory location
— Elon Musk (@elonmusk) September 20, 2021
ఇండియాతో అదే తీరు
ఇండియా విషయంలో సైతం ఎలన్ మస్క్ ఇదే తరహా వ్యవహర శైలిని కనబరిచారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కాలుష్యాన్ని వెలువరించవు కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గించాలంటూ భారత్‌ని కోరారు. దీనికి ప్రతిగా ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పితే సుంకాల తగ్గింపు అంశం పరిశీలిస్తామంటూ భారత అధికారులు తేల్చి చెప్పారు.
తేల్చి చెప్పారు
దిగుమతి పన్నులు తగ్గిస్తే ముందుగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేస్తామని, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా నుంచి సంకేతాలు అందాయి. అయితే ఎలన్ మస్క్ వ్యవహార శైలిపై అంచనా ఉన్నా భారత అధికారులు ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తేనే పన్నుల తగ్గింపు అంశం పరిశీలిస్తామని కుండ బద్దలు కొట్టారు.
ఇండియా కోసమేనా
అమెరికా,యూరప్ మార్కెట్‌ల కోసం ప్రస్తుతం ఉన్న గిగా ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచే యోచనలో టెస్లా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నాలుగో ఫ్యాక్టరీ విషయంలో రష్యాను కాదనుకోవడానికి కారణాలను ఎలన్ మస్క్ వివరించ లేదు. ప్రపంచంలోనే రెండో పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకే రష్యాను పక్కన పెడుతున్నారా ? అనే వాదనలు సైతం తెర మీదకు వచ్చింది ఇప్పుడు.
చదవండి : tesla car: కార్ల అమ్మకాల్లో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్, భారత్‌లో ఎప్పుడో !?
సంబంధిత వార్తలు