
దేశీయంగా తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నోయిడాలో ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెటీరియల్ టెక్నాలజీ సంస్థ కార్నింగ్‌తో కలిసి ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా రూ. 70 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్లాంటు వార్షిక స్థాపిత సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లుగా ఉంటుంది. దీనితో 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.
ఎల్రక్టానిక్స్ తయారీ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కీలకంగా ఉంటాయి కాబట్టి రీసెర్చ్ బృందం పరిమాణాన్ని 40 నుంచి 400 మంది సిబ్బందికి పెంచుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఆప్టిమస్‌కి వైష్ణవ్ సూచించారు. వచ్చే ఏడాది వ్యవధిలో రెండో దశ కింద అదనంగా రూ. 800 కోట్ల పెట్టుబడులతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచుకోనున్నట్లు ఆప్టిమస్ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా తెలిపారు.
దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 16,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైనోటెక్ బ్రాండ్ పేరిట మేడిన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్‌లను సెప్టెంబర్ నుంచి విక్రయించనున్నట్లు గుప్తా తెలిపారు. అపరిమిత రిప్లేస్‌మెంట్‌తో ఏడాది వారంటీ అందించనున్నట్లు వివరించారు.