పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి

Tax exemption limit should be increased asks market experts - Sakshi

30 శాతం శ్లాబ్‌ను సవరించాలి

ఆప్షనల్‌ ట్యాక్స్‌ విధానంపై నిపుణుల సూచనలు

న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్‌లో  అనుమతించాలని వారు సూచించారు. 2020–21 బడ్జెట్‌లో కేంద్రం .. సాంప్రదాయ ట్యాక్స్‌ శ్లాబ్‌లకు ప్రత్యామ్నాయంగా ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ విధానంలో హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 15 లక్షలు దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది. అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని ఎవరూ ఈ ప్రత్యామ్నాయ విధానంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఏమిటంటే ..  

► నాంగియా అండర్సన్‌ ఇండియా చైర్మన్‌ రాకేశ్‌ నాంగియా: పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలి. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలి.
► డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ సుధాకర్‌ సేతురామన్‌: జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణ రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలి. సింగపూర్, హాంకాంగ్‌ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్‌ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలి.  
► ఈవై ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ అమర్‌పాల్‌ ఎస్‌ చడ్ఢా: రూ. 50,000 స్టాండర్డ్‌ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలి. ప్రాథమిక ఎగ్జెంప్షన్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి. 30 శాతం ట్యాక్స్‌ రేటును రూ. 15 లక్షలు కాకుండా రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలి.
► ఏకేఎం గ్లోబల్‌ పార్ట్‌నర్‌ సందీప్‌ సెహ్‌గల్‌: 30 శాతం ట్యాక్స్‌ రేటును రూ. 20 లక్షల పైగా ఆదాయానికే వర్తింపచేయాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలి. ఆలస్యంగా రిటర్ను వేసే వారికి కూడా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులో ఉంచాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top