దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం వ్యయ నియంత్రణ కోసం చేపట్టిన చర్య అని వస్తున్న విశ్లేషణలను కంపెనీ యాజమాన్యం తోసిపుచ్చింది. ఈ పథకం పూర్తిగా ఉద్యోగ సంఘాల (యూనియన్ల) విజ్ఞప్తి మేరకు, వారి ప్రయోజనాల కోసమే ప్రవేశపెట్టామని కంపెనీ స్పష్టం చేసింది.
యాజమాన్యం వివరణ
సాధారణంగా ఏ కంపెనీ అయినా వీఆర్‌ఎస్ ప్రకటిస్తే అది శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికో లేదా నష్ట నివారణ కోసమో అని భావిస్తారు. అయితే, టాటా మోటార్స్ దీనిపై భిన్నమైన వాదనను వినిపించింది. ‘వివిధ ప్లాంట్ల వద్ద ఉన్న ఉద్యోగులు, యూనియన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు స్పందనగానే ఈ పథకాన్ని రూపొందించాం. ఇది హెడ్ కౌంట్ తగ్గించడానికో లేక ఖర్చులను హేతుబద్ధీకరించడానికో చేపట్టిన పథకం కాదు’ అని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
గత నాలుగేళ్లలో టాటా మోటార్స్ చేపట్టిన మూడో వీఆర్‌ఎస్ ఇది. ముఖ్యంగా, అక్టోబర్ 2025 నుంచి ప్యాసింజర్ వెహికల్ (పీవీ), కమర్షియల్ వెహికల్ (సీవీ) విభాగాలుగా కంపెనీ విడిపోతున్న నేపథ్యంలో చేపట్టిన మొదటి ప్రధాన ఉద్యోగ సంస్కరణ కావడం గమనార్హం.
భవిష్యత్ అవసరాల కోసమేనా?
కంపెనీ దీన్ని స్వచ్ఛందమైనదిగా పేర్కొంటున్నప్పటికీ పరిశ్రమ విశ్లేషకులు మాత్రం ఆటో రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులతో దీనికి ముడిపెడుతున్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) నుంచి ఎలక్ట్రిక్ వాహనాలవైపు వేగంగా మారుతోంది. సంప్రదాయ ఇంజిన్ల తయారీతో పోలిస్తే ఈవీల తయారీలో కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల అసెంబ్లీ లైన్లలో తక్కువ మంది కార్మికులు సరిపోతారు. దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, వైద్య ప్రయోజనాల రూపంలో కంపెనీకి అయ్యే వ్యయం ఎక్కువ. వన్-టైమ్ సెటిల్మెంట్ ద్వారా దీర్ఘకాలికంగా బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవడానికి కంపెనీలు ఇలాంటి పథకాలను ఎంచుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిస్పందన
టాటా మోటార్స్ వద్ద మొత్తం 58,442 మంది ఉద్యోగులు ఉండగా తాజా గణాంకాల ప్రకారం సుమారు 750 మంది ఈ పథకానికి అర్హులుగా తేలారు. అయితే, వారిలో కేవలం 275 నుంచి 300 మంది మాత్రమే వీఆర్‌ఎస్ ఎంచుకున్నట్లు సమాచారం. ఉద్యోగ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మెజారిటీ కార్మికులు విధుల్లోనే కొనసాగడానికి మొగ్గు చూపడం విశేషం.
ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు


