న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ (ఇన్‌స్టామార్ట్) సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో పనితీరును బలోపేతం చేసుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం రూ.800 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.1,081 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.5,610 కోట్ల నుంచి రూ.7,448 కోట్లకు పెరిగిపోయాయి.
స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22.6 శాతం పెరిగి రూ.9,006 కోట్లుగా నమోదైంది.
ఫుడ్ డెలివరీ విభాగంలో వార్షిక ఎబిట్డా రూ.1,000 కోట్లను దాటింది.
‘ఇన్‌స్టామార్ట్’ (క్విక్ కామర్స్) ఆదాయం స్థూల ఆర్డర్ విలువ 68 శాతం పెరిగి రూ.7,881 కోట్లకు చేరింది.
స్నాక్స్, పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను వేగంగా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన ‘స్నాక్’ను మూసివేసినట్టు వాటాదారులకు రాసిన లేఖలో స్విగ్గీ తెలిపింది. అధిక డిమాండ్‌తోనే ఈ వ్యాపారం నిర్వహణ సాధ్యమని పేర్కొంది.
మధ్యకాలానికి ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లకు, 4–5 శాతం ఎబిట్డాకి చేరుకుంటుందని అంచనా వేసింది.


