వృద్ధి రేటులో 0.3 శాతం ‘ఒమిక్రాన్‌’పాలు!

Rising Omicron cases can impact growth by 0. 3percent in March quarter - Sakshi

క్యూ4 దేశీయ ఉత్పత్తిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అంచనా  

ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నట్లు ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పతి (జీడీపీ) విలువలో కొంత మొత్తం ఒమిక్రాన్‌ వల్ల హరించుకుపోనుందని విశ్లేషించింది.

వృద్ధి రేటులో 0.2– 0.3 శాతం శ్రేణి మేర కోతపడే అవకాశం ఉందని పేర్కొంది. క్యూ4లో 6.1 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నది తమ తొలి అంచనాకాగా, ఇది 5.9–5.8 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని  పేర్కొంది. ఇప్పటికే వెల్లడైన గణాంకాల ప్రకారం క్యూ1, క్యూ2ల్లో జీడీపీ వృద్ధి రేటు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయ్యాయి. తాజా నివేదికలో బ్యాంక్‌ ఆర్థిక వేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో కొన్ని...

► రాష్ట్రాలు కోవిడ్‌–సంబంధిత ఆంక్షలు విధించడంతో (ప్రజల రాకపోకలపై రాత్రిపూట కర్ఫ్యూ, 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు పనిచేయడం) 2021–22 క్యూ4లో ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

► ప్రస్తుత తరుణంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీనికితోడు గ్లోబల్‌ రికవరీ మందగించడం వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే వీలుంది.  

► కోవిడ్‌ మహమ్మారికి సంబంధించి మునుపటి వేవ్‌ల అనుభవాలను బట్టిచూస్తే, కోవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ కదలికలపై (మొబిలిటీ) పరిమితులు మొదలవుతాయి. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.

► భారతదేశంలో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో 60 శాతం కొత్త వేరియంట్‌కు సంబంధించినవిగా ఉంటున్నాయి.  

► నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య సోమవారంనాటికి (3వ తేదీ) 1,700గా ఉంది. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను తనిఖీ           చేయడానికి భారతదేశంలో చాలా తక్కువ పరీక్షా సౌకర్యాలు ఉన్నందున ఒమిక్రాన్‌ కేసుల వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని మీడియా నివేదికలు దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసులను 18,000గా అంచనా వేస్తుండడం గమనార్హం.  

► ఒమిక్రాన్‌ భయాందోళనలు ఉన్నప్పటికీ, డాలర్‌ మారకంలో రూపాయి విలువ 74–76 శ్రేణిలో ఉండే వీలుంది. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి అవసరమైతే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జోక్యం చేసుకునే వీలుంది.  

► తాజా వేరియంట్‌ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశాలు ఉండడం వల్ల ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను మరికొంత కాలం సరళతరం రీతిలోనే కొనసాగించే వీలుంది. అలాగే బ్యాంకుల్లో అదనపు దవ్య లభ్యతను వెనక్కు తీసుకునే చర్యలనూ తక్షణం తీసుకోకపోవచ్చు. దీనిప్రకారం ఫిబ్రవరిలో ఆశించిన రివర్స్‌ రెపో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)  పెంపు ఉండకపోవచ్చు. తగిన ద్రవ్య లభ్యత, ఈల్డ్స్‌ కట్టడి వంటి అంశాలపై ఆర్‌బీఐ దృష్టి సారించే వీలుంది. ద్రవ్యల్బణం కట్టడి, వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును 4శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top