
గాంధీ బొమ్మకు బదులుగా కలాం, ఠాగూర్ ఫొటోలు ముద్రిస్తామంటూ ఆర్బీఐ..
ముంబై: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులుగా వేరే ముఖాలను చూడబోతున్నామంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నోట్లపై గాంధీ ముఖం బదులు.. రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలతో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పందించింది.
సోమవారం మధ్యాహ్నం ఆర్బీఐ ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాళ్ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు ట్విటర్‌లోనూ ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ.
RBI clarifies: No change in existing Currency and Banknoteshttps://t.co/OmjaKDEuat
— ReserveBankOfIndia (@RBI) June 6, 2022
ఇదిలా ఉంటే.. కరెన్సీ నోట్లలో మరిన్ని మేర సెక్యూరిటీ ఫీచర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ సహానికి గాంధీ సహా ఠాగూర్,కలాం ఫొటోలను ఆర్బీఐ పంపిందని, కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్, కలాం ఫొటోల ముద్రణకు సంబంధించి ఆయన నుంచి నివేదిక కోరిందని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వాటిపై వివరణ ఇచ్చిన యోగేశ్ దయాళ్ ఆ వార్తలను ఖండించారు.