నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు! | RBI Reported Cost Of Printing Currency Notes Rose By 25 Percent To Rs 6,372.8 Crore In FY25 | Sakshi
Sakshi News home page

నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!

May 30 2025 10:13 AM | Updated on May 30 2025 10:24 AM

RBI reported cost of printing currency notes rose by 25 Percent

గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణపై ఆర్‌బీఐ రూ.6,373 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ముద్రణ వ్యయం రూ.5,101 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఇది 25 శాతం ఎగిసింది. మొత్తం నోట్లలో 86 శాతం (విలువ పరంగా) రూ.500 రూపంలోనే ఉండడం గమనార్హం.

సంఖ్యా పరంగా మొత్తం నోట్లలో 40.9 శాతం రూ.500 రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత రూ.10 నోట్లు, 20, 50 రూపాయల నోట్లు 31.7 శాతం ఉన్నాయి. చెలామణిలో కాయిన్లు విలువ (50 పైసలు, రూ.1, 2, 5, 10, 20 కాయిన్లు) 6 శాతంగా ఉంది. ఉపసంహరించుకున్న రూ.2,000 నోట్లు 2025 మార్చి నాటికి 98.2 శాతం వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2022 నవంబర్‌లో తీసుకొచ్చిన సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ/ఇ–రూపీ) వినియోగం గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పుంజుకుంది.

ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!

2024 మార్చి నాటికి ఇ–రూపీ చెలామణి రూ.234 కోట్లుగానే ఉండగా.. 2025 మార్చి నాటికి రూ.1,016 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.500 నోట్ల రూపంలోనే రూ.857 కోట్లు ఉంది. సీమాంతర చెల్లింపులకు సీబీడీసీని ప్రయోగాత్మక వినియోగాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్‌ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో రిస్క్‌లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్‌బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement