ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయ్‌ !

PropTiger Report Said That House Purchased 20 percent Increase - Sakshi

న్యూఢిల్లీ: ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 15–20 శాతం అధికంగా అమ్ముడుపోవచ్చని ప్రాప్‌టైగర్‌ సంస్థ అంచనా వేసింది. నిలిచిన డిమాండ్‌ ఒక్కసారిగా ఊపందుకోవడానికి తోడు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు కలిసొచ్చే అంశాలుగా పేర్కొంది. 2020లో ఇళ్ల విక్రయాలు ఎనిమిది ప్రధాన పట్టణాల్లో 47 శాతం పడిపోయి 1,82,639 యూనిట్లుగా ఉండగా.. 2019లో 4,47,586 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు ఎక్కువ కాలం పాటు కొనసాగడం ఇళ్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడేలా చేసిందని అర్థం చేసుకోవచ్చు. ‘రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ క్యూ3 2021’పేరుతో ప్రాప్‌టైగర్‌ ఒక నివేదికను విడుదల చేసింది. 

హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణె నగరాల్లోని ధోరణులపై వివరాలను ఇందులో పొందుపరిచింది. ‘‘2021 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు (తొమ్మిది నెలల్లో) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగి 1,38,051 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 1,23,725 యూనిట్లుగా ఉన్నాయి. జూలై నుంచి ఇళ్ల ధరలు పెరగడం మొదలైంది. నిలిచిన డిమాండ్‌ తిరిగి రావడం, పండుగల విక్రయాలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండడం, ఉపాధి మార్కెట్‌లో అనుకూలతలు, తక్కువ వడ్డీ రేట్ల వల్ల ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మొత్తం మీద 15–20 శాతం స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ బిజినెస్‌ హెడ్‌ రాజన్‌సూద్‌ తెలిపారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top