
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్‌విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.
ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్‌విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్‌విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.
తోడైన కృత్రిమ మేధ విప్లవం
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్‌విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్‌విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
ఎన్‌విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్‌ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్‌ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్‌విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఇండియన్ బడ్డెట్‌కు 10 రెట్లు
ఎన్‌విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.