కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.
కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.
ఏప్రిల్ 1 నుంచి.. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025
భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.
కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.
ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!


