పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు

Jewelers see sparkling sales this holiday season after Covid gloom - Sakshi

ఒక్కరోజే రూ.7,500 కోట్ల అమ్మకాలు

షాపింగ్‌ చేసే వారి సంఖ్యలో వృద్ధి

ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్‌ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్‌లైన్‌ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి.  

15 టన్నుల ఆభరణాలు..  
జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్‌ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్‌కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్‌ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్‌ ఎండీ బలరామ్‌గార్గ్‌ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్‌ రెట్టింపైనట్టు ఆగ్మంట్‌ గోల్డ్‌ ఫర్‌ ఆల్‌ డైరెక్టర్‌ సచిన్‌ కొథారి పేర్కొన్నారు.  

20–30 టన్నుల మేర..
‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆవిష్‌ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి.

బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి.

హాల్‌మార్క్‌ ఉన్న ఆభరణాలే కొనండి
హాల్‌మార్క్‌ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్‌మార్క్‌ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్‌ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్‌లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్‌లో స్వచ్ఛత, హాల్‌మార్కింగ్‌ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్‌ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top