Work From Home: ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్‌ రిక్వెస్ట్‌

IT Companies Urged By Karnataka Govt To Extend Work From Home  - Sakshi

Work From Home Request To IT Firms: ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక్కడ కొలువైన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కొత్త రకం విజ్ఞప్తి వచ్చింది. మరికొద్ది కాలం పాటు వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలంటూ ఐటీ కంపెనీలను ప్రభుత్వం విశేషం.

ఎప్పటి వరకు వర్క్‌ఫ్రం హోం
దేశంలో ఐటీ పరిశ్రమలకు రాజధాని బెంగళూరు, వేల సంఖ్యలో ఇక్కడ ఐటీ కంపెనీలు నెలకొల్పారు. లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఈ నగరంలో నివసిస్తున్నారు. అయితే 2020లో వచ్చిన కరోనాతో అన్ని ఐటీ కంపెనీలు ఆఫీసులకు తాళాలు వేసి వర్క్‌ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు కొంత మేరకు చక్కబడటంతో తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. 2022 డిసెంబరు వరకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది.

వర్క్‌ఫ్రం హోం కారణం ఏంటీ
బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఇటీవల అవుటర్‌ రింగ్‌ రోడ్డులో ఉన్న సిల్క్‌ రోడ్డు నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ పనులు సాగుతాయని కంపెనీ చెబుతోంది. దీంతో అవుటర్‌ రింగురోడ్డులో మెట్రో పనుల కోసం రోడ్డులో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్‌ జాం సమస్యలు తలెత్తుతాయని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల మెట్రో పనులు పూర్తయ్యే వరకు ఐటీ కంపెనీలు వర్క్‌హోం అమలు చేయాలంటూ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌)కి కర్నాటక ప్రభుత్వం లేఖ రాసింది.

ఎందుకీ పరిస్థితి ఎదురైంది
బెంగళూరులో అవుటర్‌ రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రతీ రోజు ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ జాం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్య పరిష్కరించడం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాదిన్నరగా ఈ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యల బాధ తప్పింది. ఇప్పుడు ఓ వైపు మెట్రో పనులు, మరో వైపు ఐటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య పెద్దదిగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా ఇండియా ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు బ్రాండ్‌కి చేటు జరుగుతుందనే ఆందోళన  ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ప్రత్యామ్నాయం లేదా ?
ఉద్యోగులను ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలవద్దొన్న ఐటీ కంపెనీలను కోరిన ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలు కూడా వారికి సూచించింది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటే వారిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సులు వంటి పబ్లిక్‌ ‍ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేలా చూడాలంటూ సలహా ఇచ్చింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు పట్ల ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే సైకిళ్లు వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని కంపెనీలకు కర్నాటక సర్కార్‌ సూచించింది.

హైదరాబాద్‌ పరిస్థితి ఏంటీ
పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో ఆ స్థాయి ఉన్న నగరం హైదరాబాద్‌. ఇక్కడ సైతం ట్రాఫిక్‌ సమస్యలు తప్పలేదు. కరోనాకు ముందు ట్రాఫిక్‌ సమస్య కారణంగా షిఫ్ట్‌ టైమింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలను నగర పోలీసు విభాగం కోరింది. 

చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top