దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం’ (కేఫ్-2) నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయంలో దీనికి సంబందించి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో బ్యూరోక్రాటిక్ అంశాలు, బాధ్యతల నుంచి తప్పించుకునే ధోరణిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, వివిధ ఆటోమొబైల్ సంస్థలపై విధించిన సుమారు రూ.8,800 కోట్ల భారీ జరిమానాలను ఎవరు వసూలు చేయాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
కేఫ్-2 అంటే..
కేఫ్-2(కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఫేజ్ 2) అంటే కార్ల తయారీ కంపెనీలు విక్రయించే అన్ని వాహనాల సగటు ఇంధన సామర్థ్యాన్ని నియంత్రించే నిబంధనలు. దీని ముఖ్య ఉద్దేశం వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం. ఒకవేళ ఏదైనా కంపెనీ అమ్మిన కార్ల సగటు ఉద్గారాలు నిర్ణీత పరిమితి దాటితే ఆ కంపెనీకి భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనల వల్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ ఇంజిన్లు, సీఎన్‌జీ వాహనాల తయారీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.
బాధ్యత ఎవరిది?
ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, కీలక అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. ‘ఈ జరిమానాలను ఎవరు నిర్ణయించారు? వీటిని ఎవరు ఆమోదించారు? వీటన్నింటికీ మించి రూ.8,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రికవరీ చేసే బాధ్యత ఎవరిది?’ అని పీఎంఓ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నప్పటికీ జవాబుదారీతనంపై ఏ ఒక్కరూ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.
మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయలోపం
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కేఫ్ నిబంధనలను నిర్దేశిస్తుంది. అయితే, జరిమానాల వసూలు తమ పరిధిలోకి రాదని ఇది స్పష్టం చేస్తోంది. రోడ్డు రవాణా శాఖ స్పందిస్తూ తాము కేవలం మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇంధన సామర్థ్య జరిమానాల రికవరీ తమ బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిబంధనలు రూపొందించింది బీఈఈ కాబట్టి వసూలు బాధ్యత కూడా వారిదే అని రవాణా శాఖ వాదిస్తోంది.
జరిమానాలు ఇలా..
ఈ సమావేశంలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంనాటికి కేఫ్-2 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు 10 ప్రధాన కంపెనీలకు నోటీసులు అందాయి. అందులో ప్రధానంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.2,800 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1,788 కోట్లు, కియా ఇండియా రూ.1,346 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. మరోవైపు మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు నిబంధనలను సక్రమంగా పాటించినట్లు ప్రభుత్వం గుర్తించింది.
కేఫ్-3 భవితవ్యంపై ప్రభావం
ఏప్రిల్ 1, 2027 నుంచి మరింత కఠినమైన కేఫ్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రస్తుత గందరగోళాన్ని పరిష్కరించకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదని పీఎంఓ స్పష్టం చేసింది. పాత జరిమానాల రికవరీపై ఏకాభిప్రాయ యంత్రాంగం రూపొందించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీని అమలు, రికవరీకి సంబంధించిన స్పష్టమైన ఫ్రేమ్ వర్క్‌తో తదుపరి సమావేశానికి హాజరుకావాలని మంత్రిత్వ శాఖలకు తుది హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


