వెనిస్ వేదికగా జరిగిన 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన భారతీయ కళా వైభవం ప్రపంచ దేశాలను కట్టిపడేసింది. ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవం సందర్భంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఏసీసీ) నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం సాంస్కృతిక వారధిగా నిలిచింది.
చారిత్రక నగరమైన వెనిస్‌లోని ‘స్కూలా గ్రాండే డెల్లా మిసెరికార్డియా’ వేదికగా భారతీయ సంస్కృతి, కళలు కొత్త పుంతలు తొక్కాయి. 61వ వెనిస్ బిన్నాలేలో భారత పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీతో కలిసి నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రపంచ స్థాయి కళాకారులు, సాంస్కృతిక వేత్తలు, ఫ్యాషన్ రంగ ప్రముఖులను ఒకే తాటిపైకి తెచ్చింది.
అమ్మ కల.. కళాకారుల గళం
ఈ కార్యక్రమంలో ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీకి కృతజ్ఞలు తెలిపారు. ఒక క్లాసికల్ డ్యాన్సర్‌గా, విద్యావేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నీతా అంబానీ భారతీయ కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలనే లక్ష్యంతోనే ఎన్‌ఎంఏసీసీని స్థాపించారని ఇషా పేర్కొన్నారు. ‘భారతదేశపు అత్యుత్తమ కళలను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని అద్భుతమైన కళలను భారత్‌కు తీసుకురావడమే మా లక్ష్యం’ అని ఆమె స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్ ‘జియోగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్: రిమెంబరింగ్ హోమ్’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం సాగింది. డాక్టర్ అమీన్ జాఫర్ దీనికి క్యూరేటర్‌గా వ్యవహరించారు. అల్వార్ బాలసుబ్రమణ్యం, రంజని శెట్టార్, సుమక్షి సింగ్, స్కర్మ సోనమ్ తాషి, అసిమ్ వకీఫ్ తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను నిర్వహించారు.
వారసత్వానికి.. ఆధునికతకు మధ్య వారధి
ఈ వేడుక కేవలం విందుకే పరిమితం కాకుండా గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానించే ఒక చర్చా వేదికగా మారింది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని గౌరవిస్తూ సృజనాత్మకతను సజీవంగా ఉంచే ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని అంకితమిచ్చారు. భారతీయ సంప్రదాయ రుచులు, కళాత్మక అలంకరణలతో కూడిన ఈ ఈవెంట్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది.
ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు


