
పటిష్టంగా దేశ ఆర్థిక స్థితి
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి
న్యూఢిల్లీ: ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచాన్ని స్థిరపర్చే లంగరుగా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం, విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉండటం, కరెంటు అకౌంటు లోటు నెమ్మదించడం, బ్యాంకులు..కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉండటం తదితర అంశాల దన్నుతో దేశ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు.
‘ప్రభుత్వంలోని విధానకర్తలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల సమిష్టి కృషితో ఇది సాధ్యపడింది. ఇటీవల ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, పటిష్టమైన వృద్ధి బాటలో ఎకానమీ కుదురుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక గొప్ప ఫీట్‌లాంటిదే‘ అని ఆయన పేర్కొన్నారు. కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా ఈ విషయాలు చెప్పారు. అనేక దశాబ్దాలుగా నిర్మితమైన భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు మారినా సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ధరల కట్టడి, ఆర్థికాంశాలు, స్థిరమైన విధానాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడిందని ఆయన వివరించారు. ఇటీవలి పరపతి సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచిన ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించింది. వర్షపాతం సాధారణంగా కన్నా అధిక స్థాయిలో ఉండటం, జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించడం తదితర సానుకూలాంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. సెపె్టంబర్ 26తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 700.236 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.