సీఎస్‌ఆర్‌ విషయంలో కంపెనీలకు స్వేచ్ఛ!

Govt overhauls corporate social responsibility rules - Sakshi

  బహుళ సంవత్సరాల ప్రాజెక్టులకు ఓకే

ఖర్చులను మూడేళ్ల పాటు చూపవచ్చు

ప్రభుత్వం లేదా ప్రజల పేరిట ఆస్తులకూ అవకాశం

నిబంధనల్లో సవరణలు తెచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం విషయంలో కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సీఎస్‌ఆర్‌ కింద ఒకటికి మించి ఎక్కువ సంవత్సరాల పాటు పట్టే ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతించింది. అదే విధంగా నిబంధనలకు మించి చేసిన అదనపు ఖర్చును తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే విధంగా సీఎస్‌ఆర్‌ కింద లబ్ధిదారులు లేదా ప్రభుత్వం పేరిట మూలధన ఆస్తుల (క్యాపిటల్‌) కొనుగోలుకూ అనుమతించింది. కంపెనీల తరఫున సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల అమలును చూసే ఏజెన్సీలకు 2021 ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ (నమోదును)ను తప్పనిసరి చేసింది.

సీఎస్‌ఆర్‌ నిబంధనలను పాటించకపోవడాన్ని నేరపూరితం కాని చర్యగా మారుస్తూ.. దీని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టింది. ఒకవేళ సీఎస్‌ఆర్‌ కింద ఒక కంపెనీ చేయాల్సిన ఖర్చు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల్లోపు ఉన్నట్టయితే సీఎస్‌ఆర్‌ కమిటీ ఏర్పాటు నుంచి మినహాయింపునిచ్చింది. వ్యాపార సులభ నిర్వహణ విషయంలో భారత్‌ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. నిబంధనలను పాటించకపోవడాన్ని నేరంగా చూడకపోవడం, సీఎస్‌ఆర్‌ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యాలతో తాజా సవరణలు చేపట్టినట్టు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్‌ వ్యవహారాల శాఖా సీఎస్‌ఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల కాల సగటు లాభంలో కనీసం 2% సీఎస్‌ఆర్‌ కోసం కేటాయించాల్సి ఉంటుంది.  

అంతర్జాతీయ సంస్థలకు అనుమతి..
సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, విశ్లేషణ పనులను చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం కూడా కేంద్రం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా ఉంది. కాకపోతే సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల అమలు బాధ్యతలను చూడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థలను అనుమతించడం వల్ల సీఎస్‌ఆర్‌ విభాగంలో అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలు, విధానాలను తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని కార్పొరేట్‌ శాఖా తెలిపింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి సీఎస్‌ఆర్‌ నిబంధనలు అమల్లోకి రాగా.. 2014–15లో రూ.10,066 కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయి. ఇది 2018–19లో రూ.18,655 కోట్లకు విస్తరించింది. ఐదేళ్లలో రూ.79,000 కోట్లను కంపెనీలు వెచ్చించాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top