విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు! | Google techie spends RS 2 8 lakh every month to fly for work | Sakshi
Sakshi News home page

విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు!

May 14 2026 5:10 AM | Updated on May 14 2026 5:16 AM

Google techie spends RS 2 8 lakh every month to fly for work

సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లాలంటే బైకో, కారో లేదా మెట్రో రైలో ఎక్కుతారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువైతేనే విసిగిపోతుంటారు. కానీ, ఈ గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఏకంగా ఒక నగరం నుండి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ‘సూపర్ కమ్యూటర్’గా వార్తల్లో నిలిచారు. గూగుల్ సంస్థలో ‘ఫ్లో-AI’ (ఇమేజ్ అండ్‌ వీడియో జనరేషన్) విభాగంలో పనిచేస్తున్న హాంగ్ (జాసన్) వై, తన వినూత్న జీవనశైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ప్రేమ కోసం సాహసోపేత నిర్ణయం

ఈ కఠినమైన ప్రయాణాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరాలని ఆశపడ్డారు. అయితే, ఆయన జీవిత భాగస్వామి సీటెల్‌లోని అమెజాన్ కార్యాలయంలో మంచి  కెరీర్ వృద్ధిలో ఉన్నారు. "ఆమె కెరీర్‌ను దెబ్బతీయకుండా, నా వృద్ధిని కొనసాగిస్తూనే మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ ‘ఫ్లైట్ కమ్యూటింగ్’" అని వై పేర్కొన్నారు.

షెడ్యూల్, ఖర్చుల లెక్కలు ఇలా..
ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సంపాదించే మొత్తాన్ని ఈయన తన ప్రయాణాల కోసం నెలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ నుండి శాన్ జోస్ (కాలిఫోర్నియా)కు విమాన ప్రయాణం. తిరిగి గురువారం లేదా శుక్రవారం మళ్లీ సీటెల్ పయనం. ఇదీ వై  షెడ్యూల్.

రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు సుమారు 3,000 డాలర్లు (సుమారు రూ.2.8 లక్షలు) ఖర్చు అవుతోంది. "సౌకర్యం కంటే ఎదుగుదలను ఎంచుకోవాలి" అనే సిద్ధాంతాన్ని వై నమ్ముతారు. 16 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా నుండి అమెరికాకు వలస వచ్చిన ఆయనకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.

బిజీ లైఫ్.. అయినా సైడ్ హజిల్!

ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ, వై తన సృజనాత్మకతను వదులుకోలేదు. గూగుల్‌లో AI ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో సుమారు 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఒక పర్సనల్ న్యూస్‌లెటర్ కూడా నడుపుతున్నారు. "కాగితం మీద చూస్తే ఇది అర్థం లేని నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రయాణం వల్ల నేను పొందుతున్న వృద్ధి, అనుభవం.. నేను పెట్టే ఖర్చు కంటే చాలా విలువైనవి" అని వై ధీమాగా చెబుతున్నారు. నేటి తరం యువత కెరీర్, రిలేషన్ షిప్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనడానికి జాసన్ వై ఒక నిదర్శనం.

Advertisement
 
Advertisement
Advertisement