క్రిప్టోకరెన్సీ బిల్లు! ఘోరంగా పతనమైన బిట్‌కాయిన్‌, నిషేధమా.. నియంత్రణ?

Cryptocurrency Prices Crash Amid Centre Introduce Cryptocurrency Bill - Sakshi

శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్‌ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్‌ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్‌కాయిన్‌, ఎథెరియమ్‌, టెథర్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. 

The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్‌ కరెన్సీ నియంత్రణకు  ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్‌కాయిన్‌లాంటి  క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్‌ కరెన్సీలు, డిజిటల్‌ మార్కెట్‌లో పతనం చవిచూశాయి.

 

ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్‌18.53 శాతం, ఎథెరియమ్‌ 15.58 శాతం, టెథెర్‌ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్‌ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది.

 

నియంత్రణ సరిపోతుందా?

గత పదేళ్లుగా ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్‌టైజ్‌మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్‌ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్‌ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్‌, బ్లాక్‌ చెయిన్‌, క్రిప్టో ఎస్సెట్స్‌ కౌన్సిల్‌ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు.  ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. 

ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. 

ప్రస్తుతం ఎల్‌ సాల్వడర్‌ దేశం ఒక్కటే బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్‌ సందర్భంగా నవంబర్‌ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. 

Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్‌.. చెల్లనే చెల్లదంటూ స్టేట్‌మెంట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top