రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, క్రూడాయిల్ పరుగే పరుగు..ఆందోళనలో భారత్‌!

Crude Oil Effect On Indian Economy Says Fitch - Sakshi

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా భారత్‌ ఎకానమీకి తీవ్ర సవాళ్లు తప్పవని  రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. ఆయా అంశాల విశ్లేషణల అనంతరం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే (2022–23) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 10.3 శాతం నుండి 8.5 శాతానికి (1.8 శాతం) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను 60 బేసిస్‌ పాయింట్లు పెంచినట్లు పేర్కొంది. దీనితో ఈ అంచనా 8.1 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అధిక పన్ను వసూళ్లుసహా, ఎకానమీలో పలు హై ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌లు ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడమే దీనికి కారణమని వివరించింది. 2023–24లో ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 7 శాతంగా ఉండే వీలుందని పేర్కొంది. గ్లోబల్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌– మార్చి 2022 పేరుతో వెల్లడించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

కోవిడ్‌–19 మహమ్మారి  అనంతరం చోటుచేసుకుంటున్న రికవరీపై యుద్ధం ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది వృద్ధిని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. 

ఉక్రెయిన్‌పై  యుద్ధం, రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. ఆంక్షలు ఇప్పుడే రద్దయ్యే అవకాశం లేదు.  

ప్రపంచ ఇంధన సరఫరాల్లో రష్యా వాటా దాదాపు 10 శాతం. సహజ వాయువులో 17 శాతం. చమురు, గ్యాస్‌ ధరల పెరుగుదల పరిశ్రమ వ్యయాలను పెంచుతుంది. ఇంధన అధిక ధరల వల్ల వినియోగదారుల వాస్తవ ఆదాయాలు తగ్గుతాయి.  

డిసెంబరు త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు చాలా పటిష్టంగా ఉంది. జీడీపీ మహమ్మారి ముందస్తు స్థాయి కంటే 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.  అయితే వ్యవస్థలో మహమ్మారి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.  

2020, 2021లో వచ్చిన కరోనా రెండు వేవ్‌లకు భిన్నంగా 2022లో నెలకొన్న మూడవ వేవ్‌ పరిస్థితి ఉంది.  భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ నష్టంతో ఒమిక్రాన్‌ వేవ్‌ను అధిగమించిందని మా హై–ఫ్రీక్వెన్సీ డేటా సూచిస్తోంది.  

ద్రవ్యోల్బణం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా తగ్గేముందు 2022 డిసెంబరు త్రైమాసికంనాటికి 7 శాతంపైకి ద్రవ్యోల్బణం చేరుతుందని భావిస్తున్నాం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న అప్పర్‌ బ్యాండ్‌ (2–6%), ఆపైన ద్రవ్యోల్బణం సమీపకాలంలో కొనసాగుతుందని భావిస్తున్నాం.  

గత వారం రోజుల్లో స్థానిక ఇంధన ధరలు దాదాపు ఫ్లాట్‌గానే ఉన్నాయి. అయితే చమురు కంపెనీలు తుదకు అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారుకు (ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు మినహాయింపు) బదిలీ చేస్తాయని భావిస్తున్నాము.  

2022 క్యాలెండర్‌ సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను గత వారం మరొక గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ 9.5% నుండి 9.1%కి తగ్గించిన సంగతి తెలిసిందే.  అధిక ఇంధనం ధర, ఎరువుల దిగుమతి బిల్లు మూలధన వ్యయాన్ని పరిమితం చేస్తుందని మూడీస్‌ తన అంచనాల్లో పేర్కొంది.   

యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్‌  బ్యారల్‌ ధర ఈ నెల ప్రారంభంలో పదమూడు సంవత్సరాల గరిష్టం 140 డాలర్లకు చేరింది. భారత్‌ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.  

ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితం 

ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను క్యాలెండర్‌ ఇయర్‌లో 70 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఫిచ్‌ తెలిపింది. దీనితో ఈ రేటు 4.2 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top