Considerable Key Points About Reconstruction At Old Building Area - Sakshi
Sakshi News home page

ట్రెండ్‌కి తగ్గట్టుగా.. పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు.. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడ

Jan 1 2022 9:04 AM | Updated on Jan 1 2022 12:05 PM

Considerable Key Points About Reconstruction At Old Building Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్‌ మీద ఆధారపడే రియల్‌ బూమ్‌ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్‌ ప్రాజెక్ట్‌లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్‌ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్‌ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్‌ వంటి పాత రెసిడెన్షియల్‌ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులే.

ఎవరికేం లాభమంటే? 
స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్‌మెంట్‌ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. 
నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది.   
కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. 


నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. 
రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్‌ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్‌ఫార్మర్, మోటార్‌ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్‌ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్‌లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. 


బేసిక్‌ వసతులుంటాయ్‌.. 
స్థలం కొరత కారణంగా రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లల్లో బేసిక్‌ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్‌ వాటర్, వీడియో డోర్‌ ఫ్లోర్, టెర్రస్‌ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్‌ బ్యాకప్‌ వంటి వసతులుంటాయి. అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్‌ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్‌ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్‌ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. 

పాత స్థలాల్లో కమర్షియల్‌ కూడా.. 
ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్‌ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్‌మెంట్‌కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్‌ నిబంధన ప్రకారం రీ–డెవలప్‌మెంట్‌ కమర్షియల్‌ నిర్మాణాలుంటాయి.

రీ–డెవలప్‌మెంట్‌ ఎందుకంటే? 
సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్‌మెంట్‌ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్‌ తెలిపారు. ఇవే కాకుండా..
- తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్‌మెంట్‌కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. 
 - పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. 
 - రీ–డెవలప్‌మెంట్‌కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్‌ నుంచి మార్కెట్‌ విలువ 10–15 శాతం వరకు నాన్‌ రీఫండబుల్‌ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. 
 - స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది.  
 -  స్థలం, అసెట్స్‌ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది.

చదవండి: ఈ నగరంలో ఇళ్ల ధరలు అగ్గువ..! హైదరాబాద్‌ విషయానికి వస్తే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement