హిందుస్తాన్‌ జింక్‌ 26 శాతం వాటా విక్రయంపై ఎఫ్‌ఐఆర్‌ | CBI Filed FIR On Hindustan Zink Limited | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ జింక్‌ 26 శాతం వాటా విక్రయంపై ఎఫ్‌ఐఆర్‌

Apr 30 2022 8:28 PM | Updated on Apr 30 2022 10:08 PM

CBI Filed FIR On Hindustan Zink Limited - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2002లో హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌)లో 26 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత ఏడాది ఇచ్చిన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం సూచించిన విధంగానే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసులో తాజా పరిస్థితిపై నివేదికను దాఖలు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణను చేపడతామని పేర్కొంది.

సుప్రీం ఆదేశాల నేపథ్యం...
హిందుస్తాన్‌ జింక్‌ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) వ్యవహారాల్లో (26 శాతం వాటా విక్రయాలకు సంబంధించి) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ఆదేశిస్తూ గత ఏడాది నవంబర్‌18వ తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్రం ఒక రికాల్‌ పిటిషన్‌ వేసింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన ప్రాథమిక అంశాలు వాస్తవంగా తప్పని, రీకాల్‌ కోసం చేసిన అభ్యర్థన అవసరమైనదని, సమర్థించదగినదని తొలుత ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. అవరమైతే ఈ కేసు విచారణకు కేంద్రం చట్టాల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అయితే ఈ వాదనలతో న్యాయమూర్తులు డి వై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం అప్పట్లో విబేధించింది. పిటిషన్‌ను కొట్టివేస్తారస్న సంకేతాలతో వెంటనే దీనిని ఉపసంహరించుకోడానికి అనుమతించాలని తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీనికి బెంచ్‌ అంగీరిస్తూ, ‘డిస్‌మిస్డ్‌ విత్‌ విత్‌డ్రాన్‌’గా అప్పట్లో రూలింగ్‌ ఇచ్చింది.

నేపథ్యం ఇదీ...
గత ఏడాది నవంబర్‌లో ఈ అంశం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. హిందుస్తాన్‌ జింక్‌లో కేంద్రానికి మిగిలిన 29.5 శాతం వాటా విక్రయానికి లైన్‌ క్లియర్‌ చేసింది. అయితే హిందుస్తాన్‌ జింక్‌ 2002 పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ‘మే ము కొన్ని కీలకమైన వాస్తవాలు, ప్రమేయం ఉన్న వ్యక్తుల పేర్లపై వ్యాఖ్యానించడాన్ని నిరాకరిస్తున్నా ము. తద్వారా ఈ విషయం యొక్క దర్యాప్తునకు ఎటువంటి పక్షపాతం కలుగకుండా ఉంటుంది‘ అని అత్యున్నత స్థాయి ధర్మాసనం గతంలో వ్యా ఖ్యానించింది. 2002లో జరిగిన హిందుస్తాన్‌ జింక్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ అవకతవకలపై ప్రాథమిక విచారణను సాధారణ కేసుగా మార్చాలని సీబీఐకి చెందిన పలువురు అధికారుల సిఫారసులను ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆరోపణ లకు ఈ అంశం బలాన్ని ఇస్తోందని పేర్కొంది. 2002లో పెట్టుబడుల ఉపసంహరణలో జరిగిన అవకతవకలపై ప్రాథమిక విచారణను ముగించి, సీబీఐని తక్షణమే రెగ్యులర్‌ కేసు నమోదు చేయాలని, అలాగే కేసు విచారణ పురోగతిపై త్రైమాసికం వారీగా లేదా కోర్టు సమయానుకూల ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక అందజేయా లని ఆదేశించింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం 2002లో హిందుస్తాన్‌ జింక్‌ నుంచి కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వాటాలు ఇలా...
హిందుస్తాన్‌ జింక్‌ లో తనకున్న వాటా 100 శాతంలో 24.08 శాతాన్ని దేశీయ మార్కెట్లో కేంద్రం తొలుత 1991–92లో విక్రయించింది. ఈ పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రం వాటా 75.92 శాతానికి తగ్గింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న 2002 సమయంలో అప్పట్లో ‘మినీ రత్న’ హోదా హిందుస్తాన్‌ జింక్‌లో 26 శాతాన్ని వ్యూహాత్మక భాగస్వామి– ఎస్‌ఓవీఎల్‌కు (అనిల్‌ అగర్వాల్‌ నడుపుతున్న స్టెరిలైట్‌ ఆపర్చునిటీస్‌ అండ్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌) కేంద్రం విక్రయించింది. 2002 ఏప్రిల్‌ 10న ఎస్‌ఓవీఎల్‌ ఓపెన్‌ మార్కెట్‌లో మరో 20 శాతాన్ని కొనుగోలు చేసింది. 2003 ఆగస్టులో కేంద్రంతో జరిగిన షేర్‌హోల్డర్‌ అగ్రిమెంట్‌ ద్వారా మరో 18.92 శాతం కొనుగోలు చేసింది. వెరసి ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్‌ వద్ద హిందుస్తాన్‌ జింక్‌లో మెజారిటీ 64.92 శాతం వాటా ఉంది. కేంద్రం వద్ద 29.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయానికి కూడా 2012లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్‌ జింక్‌ లో ప్రస్తుతం ఎస్‌ఓవీఎల్‌ వాటా 64.92 శాతంసహా మిగిలిన వాటా ప్రభుత్వం, డీఐఐ, ఎఫ్‌ఐఐ, రిటైల్‌ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం హిందుస్తాన్‌ జింక్‌ షేర్‌ ధర క్రితంలో పోల్చితే స్వల్పంగా పెరిగి రూ.321 వద్ద ఉంది.

చదవండి: బ్రెడ్‌ మాత్రమే మిగిలింది.. మారుతి భార్గవ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement