బయోకాన్ వారసురాలిగా కిరణ్‌ మేనకోడలు | Biocon Leadership Shift Kiran Mazumdar Shaw Hands Reins Niece Claire Mazumdar | Sakshi
Sakshi News home page

బయోకాన్ వారసురాలిగా కిరణ్‌ మేనకోడలు

May 5 2026 8:17 PM | Updated on May 5 2026 9:11 PM

Biocon Leadership Shift Kiran Mazumdar Shaw Hands Reins Niece Claire Mazumdar

భారత బయోటెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన బయోకాన్ సంస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మేధస్సుతో ప్రపంచ స్థాయి బయోటెక్ సామ్రాజ్యాన్ని నిర్మించిన సంస్థ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా తన వారసురాలిని ఖరారు చేశారు. తన మేనకోడలు క్లైర్ మజుందార్ బయోకాన్ పగ్గాలు చేపట్టనున్నారని ప్రకటించారు.

క్లైర్ మజుందార్

37 ఏళ్ల క్లైర్ మజుందార్ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఆంకాలజీ (క్యాన్సర్) పరిశోధన సంస్థ ‘బికారా థెరప్యూటిక్స్’కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2018లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె సంస్థను ఒక నూతన స్థాయికి తీసుకెళ్లారు. సంస్థను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మార్చడంతోపాటు లిస్టింగ్ తర్వాత దాని విలువను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. క్లైర్ నాయకత్వంలో బికారా సంస్థ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నిర్మూలించే ‘బై-స్పెసిఫిక్ యాంటీబాడీస్’ వంటి అత్యాధునిక చికిత్సలపై దృష్టి సారించింది.

క్లైర్ విద్యా నేపథ్యం

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ రంగాల్లో ఆమె పట్టా పొందారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా సైన్స్, టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఆమె సోదరుడు ఎరిక్ మజుందార్ కాల్టెక్‌లో ఏఐ నిపుణుడిగా పనిచేస్తుండగా ఆమె భర్త థామస్ రాబర్ట్స్ ప్రముఖ క్యాన్సర్ నిపుణులు.

భవిష్యత్తు కార్యాచరణ

కిరణ్ మజుందార్-షా తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఫార్చ్యూన్ ఇండియాకు వివరించారు. ‘ఏకైక యజమానిగా సంస్థను సురక్షితమైన చేతుల్లో ఉంచడం నా బాధ్యత. క్లైర్ సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. తన వారసురాలిగా క్లైర్‌ను ప్రకటించినప్పటికీ తాను వెంటనే బయోకాన్ ఛైర్‌పర్సన్ బాధ్యతల నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. బాధ్యతలను ఒకేసారి కాకుండా దశలవారీగా తనకు అప్పగిస్తానని ఆమె తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. వారసురాలి ప్రకటనపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సంస్థపై, తన పదవిపై ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement