సౌండ్‌ తగ్గిన ఎయిర్‌టెల్‌ | Bharti Airtel Q4 Profit Falls Revenue Surges Dividend Announced | Sakshi
Sakshi News home page

సౌండ్‌ తగ్గిన ఎయిర్‌టెల్‌

May 14 2026 8:14 AM | Updated on May 14 2026 11:55 AM

Bharti Airtel Q4 Profit Falls Revenue Surges Dividend Announced

మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 34 శాతం క్షీణించి రూ. 7,325 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ప్రధానంగా చట్టబద్ధ పన్ను లయబిలిటీలకు చేపట్టిన వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ.11,022 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.

మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 55,383 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 47,876 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఆదాయంలో దేశీ విభాగం నుంచి 8 శాతం వృద్ధితో రూ. 39,566 కోట్లు లభించింది. మొబైల్‌ సరీ్వసుల విభాగం నుంచి దీనిలో రూ. 28,831 కోట్లు లభించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 245 నుంచి రూ. 257కు మెరుగుపడింది. ఇది 5 శాతం వృద్ధికాగా.. పెట్టుబడి వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 16,066 కోట్లుగా నమోదయ్యాయి. పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో 8 లక్షల కస్టమర్లు జత కలవడంతో ఈ సంఖ్య 2.9 కోట్లకు చేరింది.

పూర్తి ఏడాదికి..

మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్‌ నికర లాభం 20 శాతం నీరసించి రూ. 26,995 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 33,556 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 22 శాతం జంప్‌చేసి రూ. 2,10,973 కోట్లను తాకింది. వెరసి తొలిసారి ఆదాయం రూ. 2 లక్షల కోట్లను దాటడంతోపాటు.. 66.5 కోట్ల కస్టమర్ల మార్క్‌ను అధిగమించిన దేశీ కంపెనీగా నిలిచినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. పూర్తిఏడాదికి కంపెనీ పెట్టుబడి వ్యయాలు స్వల్పంగా తగ్గి రూ. 47,522 కోట్లకు చేరాయి. నికర రుణ భారం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్లకు తగ్గింది.

ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement