డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే

Banks face challenges in deposit accretion while maintaining margins, says India Ratings - Sakshi

నిధుల కేటాయింపులు కూడా

దీంతో మార్జిన్లపై ఒత్తిడి

ఇండియా రేటింగ్స్‌ నివేదిక

ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్‌ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్టు తెలిపింది.

బ్యాలన్స్‌ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది.

2022 డిసెంబర్‌ నాటికి బ్యాంకింగ్‌ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్‌బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్‌ను చేరుకునేందుకు అవి హోల్‌సేల్‌ డిపాజిట్లు, బల్క్‌ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది.   

సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు...
సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్‌ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా,
రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది.   

హెచ్‌ఎఫ్‌సీల రుణాల వృద్ధి మోస్తరుగా..
హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎఫ్‌సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్‌ఎఫ్‌సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది.

2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్‌ఎఫ్‌సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్‌ నివేదిక వివరించింది.

అందుబాటు గృహ రుణాల జోరు   
హెచ్‌ఎఫ్‌సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్‌ఎఫ్‌సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్‌ హౌసింగ్‌ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top