బ్యాంకు డిపాజిట్లు తగ్గుతున్నాయ్‌!

Bank deposits are falling! - Sakshi

ఐదు దశాబ్దాల కనిష్టానికి చేరిన వృద్ధి

2017–18లో పెరిగింది కేవలం 6.7%

మొత్తం డిపాజిట్లు రూ.114 లక్షల కోట్లకు

2016లో డిపాజిట్ల వృద్ధి 15.8%

ఇతర మార్గాల వైపు పయనం.

న్యూఢిల్లీ: మోదీ సర్కారు కొలువు తీరాక బ్యాంకింగ్‌ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిపాజిట్లకు చిక్చొచ్చి పడుతోంది. 2017–18లో బ్యాంకు డిపాజిట్లలో పెద్దగా పెరుగుదల లేకపోవటం దీన్ని కళ్లకు కడుతోంది. ఈ సారి గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం... బ్యాంకుల్లోకి వెళ్లే డిపాజిట్లు మ్యూచువల్‌ ఫండ్స్, బీమా, ఇతర మార్గాలవైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఆర్‌బీఐ గణాంకాలను గమనిస్తే... బ్యాంకింగ్‌ రంగంలో డిపాజిట్ల వృద్ధి 2017–18  లో 6.7 శాతమే. 1963 తర్వాత ఇదే తక్కువ వృద్ధి. డీమోనిటైజేషన్‌ తర్వాత బ్యాంకుల్లో వేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకోవటమే కాక... తిరిగి బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గిందని ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.

‘‘డీమోనిటైజేషన్‌ (2016 నవంబర్‌) తర్వాత డిపాజిట్లు పెరిగాయి. అందుకే ఆ సంవత్సరం బ్యాంకు డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంది. అయితే, ఈ డిపాజిట్లన్నీ గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇది బ్యాంకు డిపాజిట్ల వృద్ధిపై ప్రభావం చూపించింది’’ అని ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ పీకే గుప్తా తెలిపారు.  

డీమోనిటైజేషన్‌ తర్వాత మార్పు
2016 నవంబర్‌–డిసెంబర్‌ నెలల్లో బ్యాంకుల్లోకి రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. చలామణి నుంచి రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడమే దీనికి కారణం. దీంతో బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 15.8% వృద్ధితో రూ.108 లక్షల కోట్లకు చేరాయి. ఈ వృద్ధి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.114 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్‌ డిపాజిట్లు ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లడం వృద్ధి క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 22% వృద్ధితో రూ.21.36 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. 2017 మార్చి నాటికి ఫండ్స్‌ ఆస్తుల విలువ రూ.17.55 లక్షల కోట్లుగానే ఉంది.

ఇక 2016 మార్చికి ఫండ్స్‌ ఆస్తుల విలువ రూ.12.33 లక్షల కోట్లే. అంటే నాటి నుంచి 2017 మార్చికి 42% పెరిగినట్టు అర్థమవుతోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్‌ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లోనూ పెరుగుదల అధికంగానే ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీల ద్వారా మొదటి ప్రీమియం ఆదాయం రూ.1.93 లక్షల కోట్లకు చేరింది. ఇది 2016–17లో రూ.1.75 లక్షల కోట్లు, 2015–16లో రూ.1.38 లక్షల కోట్లుగానే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top