ఏషియన్‌ పెయింట్స్‌ కొనుగోళ్ల జోరు | Asian Paints to acquire majority stake in Weatherseal Fenestration and White Teak | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ పెయింట్స్‌ కొనుగోళ్ల జోరు

Apr 2 2022 6:14 AM | Updated on Apr 2 2022 6:14 AM

Asian Paints to acquire majority stake in Weatherseal Fenestration and White Teak - Sakshi

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్, డెకరేటివ్‌ విభాగాలలో మరింత పట్టు సాధించేందుకు వీలుగా దేశీ దిగ్గజం ఏషియన్‌ పెయింట్స్‌ పావులు కదుపుతోంది. తాజాగా వైట్‌ టీక్, వెదర్‌సీల్‌ ఫెనస్ట్రేషన్‌ కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. వైట్‌ టీక్‌ బ్రాండ్‌ కంపెనీ ఆబ్జెనిక్స్‌ సాఫ్ట్‌వేర్‌లో 100 శాతం వాటాను దశలవారీగా మూడేళ్లలో సొంతం చేసుకోనున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ వెల్లడించింది.

దీనిలో భాగంగా 49 శాతం వాటా కొనుగోలుకి ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు సుమారు రూ. 180 కోట్లు చెల్లించనున్నట్లు తెలియజేసింది. అయితే ఇందుకు ఇరువైపులా అంగీకరించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవలసి ఉంటుందని వివరించింది. ఇదే పద్ధతిలో మరో 11 శాతం వాటాను రూ. 66 కోట్లకు చేజిక్కించుకోనుంది. ఇక 2025–26కల్లా మిగిలిన 40 శాతం వాటా కోసం ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా రూ. 360 కోట్లవరకూ చెల్లించనుంది. 2016లో ఏర్పాటైన వైట్‌ టీక్‌ 2020–21లో రూ. 37.7 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

రూ. 19 కోట్లకు
ఇంటీరియర్‌ డెకరేషన్, పీవీసీ కిటికీలు, ఫర్నీషింగ్‌ తదితరాల తయారీ కంపెనీ వెదర్‌సీల్‌ ఫెనస్ట్రేషన్‌లో 51 శాతం వాటాను రూ. 19 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ పేర్కొంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కాగా.. మూడేళ్ల కాలంలో దశలవారీగా మరో 23.9 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.  
ఈ వార్తల నేపథ్యంలో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,112 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement