
అమెజాన్ ఇప్పటివరకు కొనసాగిస్తున్న అకౌంట్ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అక్టోబర్ 1, 2025 నుంచి అధికారికంగా ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఇది వినియోగదారులు తాము ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రైమ్ ప్రయోజనాలను ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే దీర్ఘకాలిక ఫీచర్. అయితే ఈ ప్రోగ్రామ్ స్థానంలో ఒకే కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తులు మాత్రమే ప్రైమ్ ప్రయోజనాలను పంచుకునేలా కొత్త ప్రోగ్రామ్(అమెజాన్ హౌజ్‌హోల్డ్)ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది.
కొత్త మార్పు తర్వాత ప్రైమ్ ప్రయోజనాలను పంచుకోవాలంటే సభ్యులందరూ ఒకే చిరునామాలో నివసించాలి. దాంతోపాటు ప్రైమ్ సభ్యుడికి కొన్ని ప్రయోజనాలుంటాయి.
తనతోపాటు 20 ఏళ్లు నిండిన ఒకరిని మాత్రమే చేర్చుకోవచ్చు.
నలుగురు టీనేజర్ల వరకు (ఏప్రిల్ 7, 2025 లోపు చేర్చినట్లయితే మాత్రమే) యాడ్ చేసుకోవచ్చు.
నలుగురు పిల్లల వరకు ‘కిండిల్ ఫ్రీటైమ్’ (పూర్తి ప్రైమ్ ప్రయోజనాలను పొందలేరు)వంటి ఫీచర్లను అందించవచ్చు.
ప్రైమ్ సభ్యులు వినియోగించుకునే కొన్ని సదుపాయాలను అమెజాన్ హౌజ్‌హోల్డ్‌లోనూ కొనసాగించనున్నారు. అవి..
ఉచిత రెండు రోజుల డెలివరీ
ప్రైమ్ డే డీల్స్
ప్రైమ్ వీడియో (ప్రకటనలతో)
అమెజాన్ మ్యూజిక్ (యాడ్-ఫ్రీ షఫుల్ మోడ్ మాత్రమే)
ఎంపిక చేసిన గ్యాస్ స్టేషన్లలో డిస్కౌంట్లు
ఈబుక్, ఆడియోబుక్, కొన్ని అప్లికేషన్లు వాడేందుకు అవకాశం.
ప్రత్యేక ఆఫర్
దీర్ఘకాలిక వినియోగదారుల కోసం అమెజాన్ ప్రత్యేక లాయల్టీ డిస్కౌండ్‌ను అందిస్తోంది. 2009-2015 మధ్య ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైనా కేవలం 14.99 డాలర్లకు(సుమారు రూ.1270) 12 నెలలపాటు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌కు అర్హత కలిగిన సభ్యులకు దీన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈమెయిల్ అందుతుందని పేర్కొంది. లేదా ఇప్పటికే ఉన్న ప్రైమ్ మెంబర్ షిప్ కింద అకౌంట్ సెట్టింగ్‌లను తనిఖీ చేయవచ్చని చెప్పింది.
ఎందుకీ మార్పులు?
అమెజాన్ షేరింగ్ విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా ఎక్కువ మంది భాగస్వామ్య వినియోగదారులను చెల్లింపు చందాదారులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ-కామర్స్, స్ట్రీమింగ్‌లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సభ్యులకు అందిస్తున్న ప్రయోజనాల్లో మార్పులు చేయాలని చూస్తుంది.
ఇదీ చదవండి: దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో