
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం 43 విదేశీ నగరాలకు విమానాలు నడుపుతూ ఈ ఘనత దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఎయిరిండియా(స్టాండలోన్-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను మినహాయిస్తే) 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.
14 ఏళ్ల క్రితం దిల్లీ-దుబాయ్ మధ్య ఒకే విమానంతో అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండిగో విమానయాన సంస్థకు ఈ ఘనత ఓ మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అధికారులు చెప్పారు. ఆసియా, మిడిల్‌ఈస్ట్, యూరప్ అంతటా కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరించాలన్న ఇండిగో వ్యూహానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నట్లు తెలిపారు.
గతంలో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిరిండియా ఇటీవల తనకుతాను విధించుకున్న ‘సేఫ్టీ పాజ్’, కొన్ని ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా అంతర్జాతీయ సేవల్లో అంతరాయం నెలకొంది. ఇది ఇండిగోను ముందుంచేలా చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉండగా, ఇండిగో 2025 చివరి నాటికి లండన్, కోపెన్ హాగన్, సీమ్ రీప్‌తో సహా అనేక కొత్త మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ అంతర్జాతీయ విమాన కార్యకలాపాల్లో ఇండిగో సుమారు 30% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్యను 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 40%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా?