తెలంగాణను 2030 నాటికి దేశీ విమానయాన, రక్షణ రంగాల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో 'ఎంఎస్‌ఎంఈ స్పార్క్ 3.0' (MSME Spark 3.0) సదస్సును ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI), తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.
ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తన పూర్వపు ఫైటర్ పైలట్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 2030 నాటికి తెలంగాణను విమానయాన, రక్షణ రంగాల్లో తిరుగులేని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న డీఆర్‌డీఓ (DRDO) ల్యాబ్‌లు, అత్యాధునిక తయారీ కేంద్రాలు, సుమారు 1,500 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగానికి వెన్నెముకగా ఉన్నాయన్నారు.
జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుద్ధ తంత్రాలలో డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.5 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందని, 220 తేజస్ విమానాలకు ఆర్డర్లు లభించాయని వివరించారు. 2028 నాటికి రక్షణ రంగ ఎగుమతులు రూ.50,000 కోట్లకు చేరుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ డా. చంద్రికా కౌశిక్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకమన్నారు. 'టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ పాలసీ 2025' ద్వారా డీఆర్‌డీఓ పేటెంట్లను రాయల్టీ లేకుండా ఎంఎస్‌ఎంఈలకు అందిస్తున్నట్లు తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా దేశీయ రక్షణ సామర్థ్యం నిరూపితమైందని, ఆకాశ్ క్షిపణి వంటి ప్రాజెక్టులలో ఎంఎస్‌ఎంఈలు గొప్పగా కృషి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.


