అసలేం జరుగుతోంది..? | - | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది..?

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

సుదర్శన చక్రం మాయమాయే...?

స్పష్టతలేని భద్రాచల రామాలయ అభివృద్ధి పనులు

నెలలు గడిచిపోతున్నా

టెండర్లు ఖరారుకాని వైనం

ప్రణాళికపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని భక్తుల విన్నపం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఆర్కిటెక్ట్‌, ఇతర ఉన్నతాధికారులకు తప్ప భక్తులకు ప్లాన్‌ గురించి తెలియదు. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ముందు చేపట్టిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. కాళేశ్వరం ఆలయానికి సైతం ఇదే రీతిన మాస్టర్‌ ప్లాన్‌ను ప్రకటించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించింది. ఏళ్ల తర్వాత ఆమోదించిన భద్రాచలం మాస్టర్‌ ప్లాన్‌ను మాత్రం బహిర్గతం చేయడంలేదు. ఎట్టకేలకు మూడు విడతల్లో రూ. 351 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినా.. కేవలం పగలు, రాత్రి వేళల్లో అభివృద్ధి అనంతరం ఆలయ నమూనాల విడుదల తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ఇంతవరకు భక్తులకు, ప్రజలకు తెలియదు. నూతన ఆలయాలు, ఇతర వసతుల కల్పనపై స్పష్టత లేదు. అసలేమి పనులు చేపట్టనున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది.

మూడు నెలలైనా ముందుకు సాగని పనులు

రామాలయ అభివృద్ధి బాలరిష్టాలను దాటి ముందుకెళ్లలేకపోతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదిగో..ఇదిగో రూ. 100 కోట్ల అభివృద్ధి అంటూ పదేళ్లపాటు కాలయాపన చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లు జాప్యం చేసింది. గత మార్చి చివరలో రూ.351 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళిక ప్రకటించింది. మే 1 నాటికి టెండర్‌ పూర్తి చేయాలని, శిథిలాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలు గడిచినా టెండర్‌ ఖరారు చేయలేదు. భవనాల శిథిలాల తొలగింపు పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చేసింది. దీంతో మరో మూడు నెలలు పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. అప్పటికే ఆరు నెలలు ముగిసిపోనుండగా, అనంతరం మరో ఆరు నెలలకు గోదావరి పుష్కరాలు వస్తాయి. మధ్యలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. వీటిన్నంటి మధ్య అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం భద్రాచలం రామాలయ అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని, పనులను త్వరగా పూర్తయ్యేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని భక్తులు కోరుతున్నారు.

మాస్టర్‌ప్లాన్‌లో లెక్కా పత్రం లేకుండా మార్పులు జరుగుతున్నాయి. తొలి ఫేస్‌లో గోదావరి ఒడ్డున రూ.75కోట్లతో గోదావరి ఘాట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు సుదర్శన చక్ర స్నాన తీర్థంగా పేరు పెట్టారు. ఆ తర్వాత మంత్రుల సలహాలు, సూచనలతో పూర్తిగా సుదర్శన చక్రం నిర్మాణామే తొలగించారు. తొలుత రూ.75 కోట్లను ప్రకటించగా, అనంతరం రూ.46 కోట్లకు కుదించారు. తొలత ప్రతిపాదించిన ప్లాన్‌లోని టాయిలెట్‌ బ్లాక్‌, కల్యాణ కట్ట, పిండ ప్రధాన మండపాన్ని పూర్తిగా తొలగించారు. ఇక్కడి రూ.29 కోట్లను ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ పనులకు మళ్లించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్లాన్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

మాస్టర్‌ప్లాన్‌ను బయటకు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement