దమ్మపేట: మండలంలోని గండుగులపల్లి అటవీ బీట్ పరిధిలో వన్యప్రాణుల వేటకు యత్నించిన నలుగురు వ్యక్తులపై ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు బుధవారం కేసు నమోదు చేశారు. ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని గండుగులపల్లి అటవీ బీట్‌లో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక నాటు తుపాకీ, ఐదు తూటాలు, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. కేసును చేధించిన వారిలో డీఆర్‌ఓ జయరాం, బీట్ ఆఫీసర్ భవాని, నాగరాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో
ఇద్దరికి జైలుశిక్ష
అశ్వారావుపేటరూరల్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించగా, మరో నలుగురికి జరిమానా విధించారు. ఎస్‌ఐ టి.యయాతిరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని రింగ్‌రోడ్ సెంటర్లో గత నెలలో నిర్వహించిన తనిఖీల్లో తిరుమలకుంట గ్రామానికి చెందిన కుర్సా వీరయ్య, ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన పంపారపు గంగాధరరావు అతిగా మద్యం సేవించి పట్టుబడ్డారు. కాగా, బుధవారం దమ్మపేట కోర్టులో న్యాయమూర్తి భవాని ఎదుట హాజరు పర్చగా వారిద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మరో నలుగురు వ్యక్తులకు ఒకొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే సహించేది లేదన్నారు.


