టేకులపల్లి: జిల్లా రైతులు సులువుగా ఎరువులు కొనుగోలు చేసేలా యాప్ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి బుధవారం మండలంలోని బేతంపూడి పీఏసీఎస్‌లో యూరియా బుకింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఇంటి వద్ద నుంచే సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను రూపొందించిందని తెలిపారు. జిల్లాలో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అయితే, రైతులు అవసరానికి మించి వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతోందని చెప్పారు. అలాకాకుండా అధికారుల సూచనలు పాటించాలని, తద్వారా ఎరువుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ.. ప్రతీ రైతుకు సరిపడా ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు అయినా క్వింటా రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేశామని చెప్పారు. అనంతరం యాప్ ద్వారా బుక్ చేసుకున్న పలువురు రైతులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఎరువుల బస్తాలు అందజేశారు. ఆ తర్వాత టేకులపల్లి ‘ఏ’కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు లక్కినేని సురేందర్‌రావు, రాంబాబు, సర్పంచ్ బోడ బాలు, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, సహకార శాఖ అధికారి శ్రీనివాస్, డీఏఓ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
గుండాల: ఎరువులు, పురుగుమందులు ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు హెచ్చరించారు. ఆళ్లపల్లి మండలంలోని పలు షాపులను బుధవారం తనిఖీ చేసిన ఆయన స్టాక్ రిజిస్టర్లు, ఇతర వివరాలు ఆరా తీశారు. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.


