రూ.200 కోట్ల పనులు
భద్రగిరిని వీడని కష్టాలు
ఆలయ అభివృద్ధి పనులకు ఒకే టెండర్
ఈసీఓ చెంతకు చేరిన వ్యవహారం
త్వరగా తేల్చాలని భక్తుల విన్నపం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల వ్యవహారం అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. ఆలయ అభివృద్ధి మొదటి దశ పనులకు ఇప్పటికే రెండు మార్లు టెండర్లు ఆహ్వానించినా ఓ కొలిక్కి రాలేదు. తొలిసారి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో రెండోమారు పిలిచారు. ఈసారి ఒకే బిడ్ దాఖలవడంతో వ్యవహారం ఆర్‌అండ్‌బీ శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి చేరింది. ఉన్నతాధికారులు దీన్ని ఆమోదిస్తారా లేక ఒక్కటే నమోదైనందున మూడోసారి టెండర్లను ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఆమోదమా.. ఆపేస్తారా ?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధికి సుమారు రూ.351 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. తొలి విడత రూ.200 కోట్ల పనులకు ఒకే బిడ్ నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పేరున్న నిర్మాణ కంపెనీలు ముందుకు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకే కంపెనీ ముందుకు రావడంతో అంతర్గతంగా ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. అయితే, ఈ టెండర్‌లోనూప్రైస్ బిడ్‌ను తెరిచాక ఆమోదిస్తారా, లేక అంచనాలకు తగినట్లుగా లేకపోతే తిరిగి టెండర్లు ఆహ్వానిస్తారా అన్నది తేలాల్సి ఉంది. తిరిగి టెండర్లు ఆహ్వానిస్తే మరో నెల సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం మే 1వ తేదీ నాటికి పనులను ప్రారంభించాలని సూచించింది. ఈ పనుల పూర్తికి 30 నెలలు గడువుగా పేర్కొన్నా పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు టెండర్ల వ్యవహారమే కొలిక్కి రాకపోవడంతో పరిస్థితి ఏమిటన్నది ఎటూ తేలడం లేదు.
రెండో సారి నిర్వహించిన టెండర్లలో టెక్నికల్ బిడ్ తెరిచాం. ఒకే నిర్మాణ కంపెనీ టెండర్ దాఖలు చేసింది. దీన్ని మా శాఖ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫీస్‌కు పంపించాం. అక్కడ ఉన్నతాధికారులు పరిశీలించి, ఫైనాన్షియల్ బిడ్ తెరిచాక తుది నిర్ణయం తీసుకుంటారు. – లాల్‌సింగ్, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ శాఖ
దేవస్థానం అభివృద్ధిలో మొదటి దశలో భాగంగా ఆలయ కాంప్లెక్స్ విస్తరణను నిర్ణయించారు. సుమారు రూ.200 కోట్ల పనుల బాధ్యతలను ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. తొలిసారి మే 9 నుంచి 15వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించగా ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. దీంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించగా ఒకే కంపెనీ నుంచి బిడ్ దాఖలైంది. ఈమేరకు హైదరాబాద్‌లోని శాఖ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆఫీస్‌కు పంపించారు. ఈ బిడ్ స్క్రూట్నీ అనంతరం ప్రైస్ బిడ్‌ను తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వారం నుంచి పది రోజులు పడుతుందని సమాచారం.


