బలోపేతం చేస్తే మేలు..
మార్క్‌ఫెడ్‌లో విలీనానికి
ప్రభుత్వం నిర్ణయం
ఖమ్మం డీసీఎంఎస్‌కు 63 ఏళ్ల చరిత్ర
ఉమ్మడి జిల్లాలో రూ.40 కోట్లకు పైగా ఆస్తులు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. రాష్ట్రంలోని పూర్వ తొమ్మిది జిల్లాల్లో ఉన్న డీసీఎంఎస్‌లు రైతులకు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖమ్మం డీసీఎంఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోనుంది. 60 ఏళ్ల క్రితం రైతులు, పలు వర్గాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సహకార వ్యవస్థలు, చట్టాలను రూపొందించింది. గ్రామీణస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసి, వీటికి ప్రయోజనం చేకూర్చడం, ఆర్థికంగా చేయూత నిచ్చేలా జిల్లాస్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలకు పాలకవర్గాలను నియమిస్తుండగా, డీసీఎంఎస్ ద్వారా రైతులు పండించిన పంటల కొనుగోళ్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులే కాక విత్తనాల విక్రయాలు చేపడుతున్నారు.
1963లో ప్రారంభం
ఉమ్మడి జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి 63 ఏళ్ల చరిత్ర ఉంది. 1963లో ఈ డీసీఎంఎస్ రిజి స్ట్రేషన్ కాగా, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎరువులు, క్రిమి సంహా రక మందులు, విత్తనాల అమ్మకం, పంటల కొనుగోళ్లతో బలమైన ఆర్థిక పునాదులు పడ్డాయి. ఇది జిల్లాస్థాయిలో పాలకవర్గం కలిగి రైతు సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది.
గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్‌లు
డీసీఎంఎస్ పరిధిలో రూ.40 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఖమ్మంలోని వెంకటగిరి గేటు వద్ద 5.12 ఎకరాల విస్తీర్ణంలో వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు, 500 మెట్రిక్ టన్నుల రెండు గోదాములు ఉన్నాయి. ఇవికాక కొత్తగూడెంలో వేయి, 500 మెట్రిక్ టన్నుల గోదాములు రెండు, భద్రాచలంలో 1,500, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములు ఉన్నాయి. ఇక ఖమ్మంలో 32 షాపులతో కూడిన కాంప్లెక్స్ ఉంది. అలాగే, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద 1.20 ఎకరాలు, మధిరలో 333 గజాల స్థలం ఉంది. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.40కోట్ల వరకు ఉంటుంది. అలాగే, దుకాణ సముదాయాలు, గోదాముల నుంచి అద్దె రూపంలో నెలవారీ ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమాన డీసీఎంఎస్ రూ.15 లక్షలకు పైగా లాభాల్లో కొనసాగుతుండగా, సొసైటీని మార్క్‌ఫెడ్‌లో విలీనం చేస్తే ఆస్తులన్నీ బదలాయించే అవకాశముంది. అయితే, డీసీఎంఎస్ పరిధిలో కొనసాగుతున్న 70 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మార్క్‌ఫెడ్‌లోకి తీసుకుంటారా, లేదా అన్నది తేలాల్సి ఉంది.
డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేసే అంశం రాజకీయ పార్టీల నాయకులు, రైతుల్లో చర్చ జరుగుతోంది. ఆరు దశాబ్దాలుగా రైతు లు, పలు వర్గాలకు సేవలందిస్తున్న డీసీఎంఎస్‌లను తొలగించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, భూములు కలిగిన డీసీఎంఎస్‌ను తొలగించడం కన్నా బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తే రైతులు, ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.


