వరద కాల్వకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

వరద కాల్వకు మోక్షం

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

● వీడిన నష్ట పరిహారం చిక్కుముడి ● మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో కదలిక

ప్రతిపాదన పంపించాం

● వీడిన నష్ట పరిహారం చిక్కుముడి ● మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో కదలిక

అశ్వారావుపేటరూరల్‌: ఏళ్లుగా సాగుతున్న వెంకమ్మ వరద కాల్వ సమస్యకు మోక్షం లభించినట్లయింది. నిర్వాసిత రైతులకు నష్టపరిహారం వివాదం నేపథ్యంలో పనులు నిలిచాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జోక్యంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మండలంలోని ఊట్లపల్లిలోని వెంకమ్మ చెరువు అలుగు నుంచి ఏటా వానాకాలం సీజన్‌లో వేలాది క్యూసెక్కుల వరదనీరు వాగుల్లో కలిసి వృథాగా ఏపీలోని గోదావరిలో కలుస్తోంది. ఈ వృథా జలాలను కాల్వలు నిర్మించి పంట పొలాలకు తరలిస్తే వందల ఎకరాల భూముల్లో పంటలు పండుతాయని భావించి నాటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా 2005 డిసెంబర్‌ 31న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ వరద కాల్వ నిర్మాణానికి వైఎస్సార్‌ హయంలోనే రూ.13కోట్లు నిధు లు కుడా కేటాయించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ 2009లో ఒప్పందం చేసుకుని, 2010లో పనులు ప్రారంభించారు. వెంకమ్మ చెరువు నుంచి(కేసప్పగూడెం) దబ్బతోగు ప్రాజెక్టు చెరువు దాకా 15 కిలోమీటర్లు, నారాయణపురం – ఆసుపాక మధ్యలోగల లోతువాగు చెరువుకు మరో 7 కిలోమీటర్లు కలిపి మొత్తం 22 కిలోమీటర్ల దూరం వరద కాల్వ నిర్మించాల్సి ఉంది. మూడేళ్ల క్రితమే 18 కిలోమీటర్ల వరకు కాల్వ నిర్మించారు. మరో నాలుగు కిలోమీటర్లు కాల్వ తీయాల్సి ఉంది. ఈ కొద్ది పనులను పూర్తి చేస్తే వృథా వరద నీరు దబ్బతోగు, లోతువాగు చెరువుల్లోకి చేరి దాదాపు ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

సమస్య పరిష్కారం

కాల్వ కింద భూములు కోల్పోతున్న గిరిజన, గిరిజనేతర రైతులు 152 మందికిగాను 42 ఎకరాలకు నీటిపారుదల శాఖ ద్వారా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. అందులో 20 ఎకరాలు పట్టా భూములు, మరో 22 ఎకరాలు అసైన్డ్‌ భూములు ఉన్నాయి. భూసేకరణ సమయంలో ఒక్కో ఎకరానికి రూ. 1.35 లక్షలు చొప్పున ప్రభుత్వం నిర్ణయించగా, ఐదేళ్ల క్రితం పాత భూసేకరణ చట్ట ప్రకారం రూ.78 లక్షలు మంజూరు చేసింది. అప్పటికే 2013 భూసేకరణ చట్టం అమలులోకి వచ్చి ఏడేళ్లు కావడంతో కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని, నష్ట పరిహారం చెక్కులను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా ఈ కాలువ పూర్తి కావడం లేదు.

దశలవారీగా పోరాటాలు..

కాగా, రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆది వాసీ గిరిజన సంక్షేమ సంఘం బాధ్యులు మడకం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు భూసేకరణ గ్రామసభ సైతం అడ్డుకున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టి సారించి బాధిత రైతులు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో చర్చలు జరిపించారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజన రైతులకు ఎకరానికి రూ.10.80 లక్షలు, గిరిజనేతరులకు ఎకరానికి రూ.22.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో సమస్య పరిష్కారమై మరికొద్ది నెలల్లోనే కాల్వ పనులు పూర్తి కానున్నాయి.

మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని అందించే విధంగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక అందించాం. త్వరలోనే నిర్వాసిత రైతాంగానికి పరిహారం చెక్కులు మంజూరు అవుతాయి.

–వెంకటేశ్వరరావు, డీఈఈ, నీటిపారుదల శాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement