సింగరేణి ఓబీ డంప్‌యార్డుల్లో
మొక్కల పెంపకం
ఈ ఏడాది ప్రయోగాత్మకంగా
7 ఎకరాల్లో మొక్కజొన్న
సింగరేణి ముందు వరుసలో
మణుగూరు టౌన్: మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓబీ మట్టిగుట్టలపై పచ్చదనం పరుచుకుంటోంది. ఏటా యాజమాన్యం మొక్కలు నాటి రక్షిస్తోంది. 1989 నుంచి 2025 సంవత్సరం వరకు 1440.58 హెక్టార్లలో 32,32,032 మొక్కలు నాటింది. పీకేఓసీ, మణుగూరు ఓసీ మట్టి గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచుతోంది. వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది కూడా వన మహోత్సవానికి సిద్ధమవుతోంది. 1,52,450 మొక్కలు నాటేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. 19.50 హెక్టార్లలో 48,750 మొక్కలు, ఎండిపోయిన, చనిపోయిన మొక్కల స్థానాల్లో 25 హెక్టార్లలో 62,500 మొక్కలు, మొదటి సంవత్సరం మొక్కల మెయింటెనెన్స్ కింద 41,200 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించింది. నారేప, వెదురు, రావి, వేప, బట్టగనం, ఎగిస, ఉసిరి, నేరేడు, ఏడాకులపాల, చిందుగ, సీతాఫలం, తాని, ఆకాశమల్లె, చింత, రేల, సీమచింత, తప్సి, టేకు, బండారి, పుత్రంజీవ, బూరుగ, కరక వంటి 40 మొక్కలు నాటనున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా మణుగూరు ఓసీలోని సుమారు 7 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఏటా వానాకాలం మొక్కలు నాటడం, సమీప ప్రజలకు పంపిణీ చేయడంలో సింగరేణి ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది కూడా మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాలను గుర్తించాం. సమీప గ్రామాల్లో కూడా మొక్కలు పంపిణీ చేస్తాం.
–దుర్గం రాంచందర్, ఏరియా జీఎం


