పెళ్లికి నెలే.. పనులవుతాయా?
ఇంకా అందుబాటులోకిరాని
డార్మెటరీ జీ ప్లస్ 2 భవనం
వచ్చే నవమికి కూడా భద్రగిరిలో భక్తులకు తప్పని వసతిపాట్లు
మార్చి 27న శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణం
నిర్మాణం పూర్తికాని ప్రసాద్ పథకంలో చేపట్టిన డార్మెటరీ భవనం
భద్రాచలంలో ప్రసాద్ పథకం పనులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ విధానంలో 2022, డిసెంబర్ 28న ప్రారంభించారు. నిర్మాణాల కోసం మిథిలా స్టేడియం వెనుక భాగంలో ఉన్న రెండు ఎకరాలను కేటాయించారు. ఇక్కడ జీ ప్లస్ 2 భవనం నిర్మిస్తున్నారు. అన్నప్రసాద మండపం సైతం ఇందులోనే ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
2024 జూలై 30వ తేదీలోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి కాకపోవడంతో 2024 డిసెంబర్ వరకు, ఆ తర్వాతో మూడోసారి 2025 జూన్ వరకు గడువు పొడిగించారు. అప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో నాలుగో సారి మళ్లీ పొడిగించారు. పనుల గడువు పెంచుతున్నారే తప్ప భవన నిర్మాణం పూర్తి చేయడంలేదు. ఇప్పటివరకు మొదటి ఫ్లోర్ పనులు కూడా పూర్తికాలేదు.
వేధిస్తున్న వసతి కష్టాలు
ముక్కోటి, శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు భద్రగిరి వస్తారు. ఇటీవల కాలంలో సెలవు రోజుల్లో కూడా భక్తుల రాక పెరిగింది. రద్దీ నేపథ్యంలో భక్తులకు వసతి దొరకడంలేదు. దేవస్థానానికి చెందిన కాటేజీలు పరిమితంగా ఉండటం, వసతి గదులు తక్కువగా ఉండటంతో ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా నిర్వాహకులు వారాంతపు రోజుల్లో రెండు వేల నుంచి 5 వేల వరకు అద్దె వసూళ్లు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల భక్తులకు ఆర్థికభారమవుతోంది. కొందరు భక్తులు కరకట్ట, గోదావరి తీరం పాన్పులవుతున్నాయి.
ప్రస్తుతం నిత్యాన్నదాన సత్రాన్ని మిథిలా స్టేడియానికి పక్కన ఉన్న ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే వరద నీరు సత్రాన్ని ముంచెత్తుతుంది. ఆ రోజుల్లో భక్తులకు అన్నదాన ప్రసాద సమస్యలు వస్తున్నాయి. తిరుపతి, షిరిడీ తదితర ప్రాంతాలా తరహాలో ఉదయం, రాత్రి వేళల్లో అన్నదానం నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ప్రసాద్ పథకంలో చేపట్టిన జీప్లస్ 2 భవనం పూర్తయితే కొంత మేర ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
శ్రీరామనవమికి నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ఈసారి కూడా భక్తులకు వసతి కష్టాలు తప్పవు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, టూరిజం శాఖ అధికారుల అలసత్వంతో పనులు వేగంగా సాగడంలేదు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించాల్సి వస్తుండటంతో ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని అధికారులు అంతర్గతంగా పేర్కొంటున్నారు.
ఇక బ్రిడ్జి సమీపంలో చేపట్టిన టూరిజం రెస్టారెంట్ పనులు తుది దశకు చేరాయి. భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం పార్కింగ్ పనులు నడుస్తున్నాయి. నాలుగు వైపులా పార్కింగ్, ఇతర పనులను పూర్తి చేస్తే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నవమికి రెస్టారెంట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మూడేళ్లుగా సాగుతున్న ప్రసాద్ పథకం పనులు
పెళ్లికి నెలే.. పనులవుతాయా?


