న్యూస్‌రీల్
నెత్తిన గుది‘బండ’
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
సత్తెనపల్లి: పశ్చిమాసియ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి మార్కెట్‌లో నిత్యవసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో పేద ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
యుద్ధాన్ని బూచిగా చూపి..
అమెరికా–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచేశారు.
ధరల కట్టడిలో విఫలం...
నిత్యావసర ధరలు రెండు నెలల నుంచి పెంచి సామాన్యులను దోచుకుంటున్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలకులు యుద్ధప్రభావం ఏమీ లేదని చెబుతుంటేఏ మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి.
ఏం కొనేటట్టు లేం..
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా .. నూనె, గ్యాస్ కనీస అవసరం. నూనె లేనిదే, గ్యాస్ లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా అసలు వంటకాలే తగ్గిస్తున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్‌తో సరిపెట్టుకుంటున్నారు.
సామాన్యులకు వెజి ‘ట్రబుల్స్’...
ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నింటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు రూ. 20 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ. 60 వరకు పెరిగాయి. డజన్ నిమ్మకాయలు రూ. 120 పైనే విక్రయిస్తున్నారు. కూరగాయలు రకాన్ని బట్టి రూ 10 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వినియోగ దారులు చెబుతున్నారు.
రకం పాతధర(కిలో) కొత్త ధర
వంకాయలు రూ. 40 రూ. 60
టమాటా రూ. 30 రూ. 40
గోరుచిక్కుళ్లు రూ. 30 రూ. 40
బెండకాయలు రూ. 40 రూ. 50
దొండకాయలు రూ. 30 రూ. 40
పచ్చిమిర్చి రూ. 30 రూ. 50
బీరకాయలు రూ. 40 రూ. 60
పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు కమర్షియల్ సిలిండర్ ఏకంగా రూ. 993 పెరిగింది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు ధరలను నియంత్రించడంతోపాటు గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
పప్పుల నుంచి నూనెల
వరకు అదే తీరు
సలసల కాగుతున్న వంట
నూనెల ధరలు
కూరగాయల ధరలకు సైతం రెక్కలు
ఇంకా పూర్తిస్థాయిలో తీరని
వంట గ్యాస్ కష్టాలు
సామాన్య, పేద ప్రజలు బతికేదెలా?
ఆందోళన వ్యక్తం చేస్తున్న పేదలు
పట్టించుకోని కూటమి పాలకులు


