తెనాలి: పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో రేషను దుకాణాలకు చౌక బియ్యం సరఫరాలో ఈ నెలలో జాప్యం చోటుచేసుకుంది. ఎక్కువ షాపులకు ఒకటి రెండు తేదీల్లో మాత్రమే సరుకు అందింది. దాదాపు 80 చౌక దుకాణాలకు మూడో తేదీ రాత్రికి సరుకులు చేరుకున్నాయి. ఇంకా నలభై షాపులకు బియ్యం, పంచాదార చేరనేలేదు. దీంతో గత మూడురోజుల్నుంచి రేషను కార్డు పట్టుకుని షాపులకు వెళుతున్న పలువురు పేదలు ‘నో స్టాక్’ పేరుతో ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారు. పట్టణంలోని మండల స్టాక్ పాయింట్ (ఎంఎల్‌ఎస్ పాయింట్) పరిధిలో తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలంతోపాటు మంగళగిరి పరిధిలోని దుగ్గిరాల, పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలాలున్నాయి. అన్నింటిలో కలిపి 230 చౌకధరల దుకాణాలున్నాయి. ప్రతినెల ఒకటో తేదీనుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదార ఇస్తున్న విషయం తెలిసిందే. తెనాలిలో మాత్రం అదనంగా గోధుమపిండి ఇస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషను బియ్యం, పంచదార ఒకటో తేదీకల్లా కార్డుదారుల ఇళ్లముందుకు వచ్చేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాలతో పంపిణీని రద్దు చేసింది. అంతకుముందులాగా కార్డుదారులు రేషను షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఒకటో తేదీనుంచి సరుకుల పంపిణీకని, ముందు నెల చివరి వారంలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌నుంచి సరుకులు రేషను దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. అంటే నాలుగైదు రోజులు ముందుగానే అందుబాటులో ఉంచుతున్నారు.
రేషను షాపులకు మే నెలలో సరఫరా చేయాల్సిన బియ్యాన్ని కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తరలిస్తున్నట్టు సమాచారం. తెనాలిలోనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉంది. వడ్లమూడిలో కేంద్రం గిడ్డంగుల సంస్థ గిడ్డంగులున్నాయి. ఇలా దగ్గర్లోని గిడ్డంగుల్నుంచి బియ్యం సరఫరా చేయకుండా గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం అంటున్నారు. సాక్షాత్తూ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గంలోనే అధికారుల తీరుతో కార్డుదారులు ఇబ్బందులకు గురికావాల్సివచ్చింది.
నలభై దుకాణాల్లో ‘నో స్టాక్’
మే నెల వచ్చేసరికి పరిస్థితి మారింది. ఒకటో తేదీనాటికి దాదాపు సగం షాపులకు సరుకు చేరని పరిస్థితి ఎదురైంది. రెండో తేదీ వచ్చేసరికి ఇంకా 80 షాపులకు సరుకు చేరనేలేదు. కొన్నింటిలో అర్ధరాత్రికి కూడా సరుకులు సరఫరా చేస్తూనే వచ్చారు. నాలుగో తేదీవచ్చేసరికి ఇంకా నలభై షాపుల్లో కార్డుదారులకు ‘బియ్యం నో స్టాక్’ అనే సమాధానం ఎదురయింది. అయితే పట్టణంలో 3–4 షాపులు, రూరల్ మండలంలో పది షాపులకు మాత్రమే రావాల్సి వుందని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా రేషను షాపులకు బియ్యం, పంచదార సరఫరాలో జాప్యం నెలకొంది. మిగిలిపోయిన షాపులకు రోజుకు కొన్నింటికి చొప్పున సరఫరా చేస్తున్నారు. దీని ఫలితంగా రేషను షాపులకు వెళ్లిన కార్డుదారులను సరుకుల్లేక నిట్టూరుస్తూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేసవి ఎండల్లో రేషను షాపులకు పలుసార్లు తిరగాల్సి రావటం కార్డుదారులకు కష్టంగా తయారైంది.
● తెనాలి ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో
నిండుకున్న రేషన్ బియ్యం నిల్వలు
● నాలుగు రోజులైనా
రేషన్ దుకాణాలకు చేరని వైనం
● దాదాపు 80 షాపులకు మూడో తేదీకి
మాత్రమే చేరిన సరుకులు
● ఇంకా రేషను అందని 40 షాపులు
● బియ్యం కోసం వచ్చి
తిరిగి వెళుతున్న పేదలు
వైఎస్సార్ సీపీ హయాంలో ఠంఛనుగా..
గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం !