బాపట్ల: పశువుల కోసం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. పశువులకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలను మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు నాలుగు కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక గొర్రెలు సహకార సంఘాల ద్వారా ఈ కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. అత్యంత చౌక ధరలకే పశువులకు సంబంధించిన ఔషధాలన్ని ఈ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. ఒక ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.3.61 లక్షలు ఖర్చు అవుతుందని, అందులో 25 శాతం ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందన్నారు. ఐదుగురు జిల్లా స్థాయి అధికారులతో నియమించిన కమిటీ ఔషధ కేంద్రాలకు అనుమతి ఇస్తుందన్నారు. జేసీ భావన వశిష్ఠ, డీఆర్‌ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
● జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో జిల్లాలో హెచ్‌ఐవీ నిర్మలన పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
● కౌమార బాలబాలికల సాధికారత సాధనకు కిశోరి వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసంపై రూపొందించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. కిశోర వికాసం కార్యక్రమాలు వేసవిలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మంగళవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


