వైద్య సేవల కోసం పేద రోగుల పడిగాపులు ఓపీ చీటీ కావాలంటే ఎంతో ఓపిక కావాల్సిందే వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే నిరీక్షించాల్సిందే అందుబాటులో లేని సీనియర్ వైద్యులు మధ్యాహ్నం ఓపీ సేవలు అందితే ఒట్టు చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పడకేసిన వైద్యం
ఓపీ చీటీకి ఓపిక కావాల్సిందే..
గుంటూరు మెడికల్: జీజీహెచ్‌కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా ఉంది.
వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు....
జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్‌లపై, వీల్‌చైర్‌లలో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్‌లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు.
ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు.....
పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్‌ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే.
అర్ధాకలితో విధుల నిర్వహణ
జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు.
ముట్టజెప్పాల్సిందే...
కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్‌ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్‌షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
నీటి కష్టాలు తప్పడం లేదు
ఎండలకు జీజీహెచ్‌లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయడం లేదు. ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్‌చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగుల సహాయకులే తరలించాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.
గుంటూరు జీజీహెచ్‌లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్‌లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు.


