నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు.
రూ.25 లక్షల ఆస్తి నష్టం
గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్‌గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు.
‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో
ప్రముఖ వైద్యులు
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్‌ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి..


