ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ రాత్రిళ్లు గస్తీ ముమ్మరం చేస్తాం బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల సందర్భంగా అనేక కుటుంబాలు విహారయాత్రలు, తీర్థయాత్రలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లకు వెళుతుంటారని, ఈక్రమంలో ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల, పరిస్థితులను గమనించి అపరిచితులు, దుండగులు తాళాలు వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తాళం వేసిన ఇంటిలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లు, ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలన్నారు. సమాచారం అందినప్పుడు పోలీసులు ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి గస్తీ సమయంలో ఆ ఇళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, 112 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న గృహాల వివరాలను సేకరించి, రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ఆ గృహాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సైరన్ వేస్తూ రాత్రి గస్తీ విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి వేలిముద్రలను సేకరించాలన్నారు.


