గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు.


